ఇంత దిగజారుడా?!

19 Nov, 2016 00:34 IST|Sakshi
ఇంత దిగజారుడా?!

‘నాపైన ఎన్నో కేసులు పెట్టారు. ఇబ్బందులు పెట్టాలని చూశారు. ఏదీ నిరూపించ లేకపోయారు. నేను నిప్పులాంటివాడినని రుజువైంది’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెబుతుంటారు. ఈమధ్య పెద్ద నోట్లు రద్దయిన దగ్గర నుంచి అది తన ఘనతేనని ఆయన వీలు దొరికినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. అందుకు రుజువుగా గత నెలలో కేంద్రానికి రాసిన లేఖను సైతం గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తి తరఫున ఉమ్మడి హైకోర్టు ముందు ‘ఓటుకు కోట్లు’ కేసులో సాగుతున్న వాదనలు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. ఓటేయడం ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమేనని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.

రాష్ట్రపతి పదవికి, రాజ్య సభ స్థానానికి లేదా ఎమ్మెల్సీ పదవికి ఎవరినైనా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఇవ్వడంలో ఉద్దేశం ఆ ఓటు ద్వారా ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుందనే. పార్లమెంటు, అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లాగే ఆ ఎన్నికలు కూడా ప్రజా స్వామ్య ప్రక్రియలో భాగమే. ప్రజాప్రతినిధులుగా ఉంటున్నవారు ఓటేయడం రాజ్యాంగ బాధ్యతే తప్ప అది ప్రజా విధుల్లో భాగం కాదని బాబు తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ప్రజావిధిలో భాగం కానప్పుడు ఓటుకు డబ్బు తీసుకున్నా నేరం కాదన్నది ఆ వాదన సారాంశం. మరో విధంగా చెప్పాలంటే ఆయన దృష్టిలో ఓటును కొనడం, అమ్మడం నేరం కానే కాదు!  న్యాయస్థానం వెలుపల బాబు చెప్పే కబుర్లు వేరు. వివిధ వేదికలపై ఇందుకు సంబంధించి ఆయన వల్లించే నీతులకు హద్దూ పద్దూ ఉండదు. వాస్తవానికి రేవంత్‌ రెడ్డి ఉదంతం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన మహానాడులో తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను ‘సంతలో పశువుల్లా’ కొంటున్నారని చంద్రబాబు తెగ బాధపడ్డారు. తీరా అదే పని చేయ బోతూ తాను దొరికిపోయారు.

ఓటు హక్కు అన్నది రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనాస్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛలోనూ అంతర్భాగమని మూడేళ్లక్రితం సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ స్పష్టంచేసింది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా జరిగే ఒక ఎన్నికలో పాల్గొనే ఎమ్మెల్యేలకు ఆ సూత్రం వర్తించదా? ఆ ఎమ్మెల్యేలకు డబ్బు కట్టలు ఎర చూపడం ఆ ఎమ్మెల్యేల భావప్రకటనాస్వేచ్ఛకూ, వారి వ్యక్తి స్వేచ్ఛకూ ముప్పు కలగజేయడంతో సమానం కాదా? ఆ నేరానికి పాల్పడ్డవారికి శిక్ష ఉండొద్దా? ఒకపక్క ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ప్రలోభాలకు గురిచేయడం పెరిగిపోయిందని బాబు తరచు ఆవేదన పడుతుంటారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడం తగ్గుతుందని మొన్నటికి మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. తీరా ఇప్పుడు ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం అవినీతి కాదని న్యాయస్థానంలో వాదించడం సిగ్గుచేటు కాదా? ఒకపక్క సాధారణ పౌరులకు ఓటు హక్కును తప్పనిసరి చేయా లన్న వాదనలు వస్తున్నాయి. అందుకు సంబంధించి ఒకటి రెండు రాష్ట్రాలు చట్టాలు కూడా తీసుకొచ్చాయి.

వాటి రాజ్యాంగ బద్ధత సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో ఉంటూ దాని ఫలాలు అనుభవిస్తూ ఓటింగ్‌లో పాల్గొనకపోతే ఎలా అన్నది ‘తప్పని సరి ఓటు’ అనుకూలుర వాదన. అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు మాత్రం ఓటు అమ్ముకోవచ్చని చెప్పడం ఎలాంటి నీతి?‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు వాదనలన్నీ సాంకేతిక కారణాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవారు అన్నివేళలా నిజాయితీగా ఉండాలా, లేక కొన్ని సందర్భాల్లో ఉంటే చాలా అన్న తర్కం ఇందులో నడుస్తోంది. మరి ప్రజాప్రతినిధికి ఉండాల్సిన నైతిక విలువల సంగతి, ఉన్నత వ్యక్తిత్వం వగైరాలు ఏమైనట్టు? పోటీలో ఉన్నవారిలో మెరుగైన వ్యక్తి అని మాత్రమే కాదు... నైతికంగా దిగజారిన వ్యక్తి కాదన్న విశ్వాసంతోనే ఓటర్లు తమ ప్రతినిధిగా ఎంచు కుంటారు. అలాంటివారు ఓటుకు అమ్ముడుపోవడం లేదా వారిని కొనుక్కోవడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య కాదనడం హాస్యాస్పదం కాదా? పైగా ఎఫ్‌ఐఆర్‌ నమోదై ఉన్న కేసులో దర్యాప్తునకు ఆదేశించడం వల్ల మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి వస్తుంది గనుక ఆ చర్య చెల్లదని బాబు తరఫు న్యాయవాది వాదించారు.

తన వరకూ వచ్చేసరికి ఇన్ని రకాల సాంకేతిక లోపాలను వెదికే బాబు... రేవంత్‌రెడ్డిని తాను పంపలేదని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో గొంతు తనది కాదని ఒక్క సందర్భంలో కూడా అనలేదు. పైగా ఆడియో, వీడియో టేపులు బయటికొచ్చిన వెంటనే ‘నా ఫోన్‌ ట్యాప్‌ చేయిస్తారా...’ అని ఉగ్రుడయ్యారు. ‘నాకూ ఏసీబీ ఉంది. నాకూ పోలీసులున్నారు...’అంటూ హుంకరించారు. ఈ పోకడలన్నీ నిజానికి ఏ న్యాయస్థానం విచారణా, ఏ ఫోరెన్సిక్‌ నిపుణుడి ధ్రువీకరణా అవసరం లేకుండానే ఆయన ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించాయి. అయినా సరే ఆయన గాంభీర్యం ఏమాత్రం తగ్గలేదు.  

ఈ కేసు విషయంలో స్వీయ రక్షణకు చంద్రబాబు అవలంబిస్తున్న పద్ధతులు, వాదనల సంగతలా ఉంచి కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైనా, పట్టనట్టు ఉంటున్న కేంద్ర ప్రభుత్వ పోకడైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన కేసులో దర్యాప్తు ఇంత నత్త నడకన సాగడం తనకు పరువు తక్కువని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం లేదు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న పార్టీ అధినేత ఒకరు పబ్లిగ్గా దొరికినా వారితో చెలిమి కొనసాగించడం తనకు అపకీర్తి తెస్తుందని కేంద్రంలోని ఎన్‌డీఏ పెద్దలు అనుకోవడం లేదు. పైగా ఈ కేసులో తామే రాయబారం నడిపి రాజీ చేశామన్న ఆరోపణలు వస్తున్న సంగతిని గ్రహించినట్టు కనబడదు. ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తు ఒత్తిళ్లు లేకుండా సాగి ఉంటే ఈపాటికే అది ఒక కొలిక్కి వచ్చేది. ఈ కేసును ఏదో విధంగా నీరుగార్చాలని చూస్తున్న చంద్ర బాబు పోకడలు వింతగొలుపుతాయి. ఇది సాధ్యమైనంత త్వరగా తేలాలని, దోషు లకు శిక్ష పడాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు