నన్నెవరూ, నువ్వెవరూ అని అడగవద్దు!

25 Apr, 2016 11:31 IST|Sakshi
నన్నెవరూ, నువ్వెవరూ అని అడగవద్దు!

లేఖాసాహిత్యం

బహుశ నేను సవితను కావొచ్చు. నా హృదయం పూచిన పాటలిని కావొచ్చు.
శరత్ శ్రీకాంత్‌లోని కమల లతని కావొచ్చు. రాస్కల్నికోవ్ ఎవరి పాదాల దగ్గర
కూచుని తన గాథ వినిపించాడో, ఆమెనే నేను కావొచ్చు.

 
ఎపుడైనా ఎవరైనా నువ్వెవరూ నీ పేరేమిటీ అని అడుగుతారు. అడిగిన ప్రతిసారీ నేను తడబడిపోతాను. ఇది నా పేరనీ, ఇది నా వూరనీ, ఇది నా పననీ, ఇది నా ప్రేమనీ స్పష్టంగా చెప్పడానికి తోచదు.

నా ఆత్మ మూలాలు ఇక్కడెక్కడా కాక యే గంగామాతలోనో చిక్కుకున్నట్లు తోస్తుంది. లేదా ఏ ఫ్రాన్స్‌లోనైనా చిక్కుకుని వున్నట్లు తోస్తుంది. నా పేరు నేనే మర్చిపోదామనుకుంటున్న వేళల్లో, నీ పేరేమిటీ అంటే ఎలా చెప్పేది? ‘మనల్ని వేరుచేసే అంశాలలో పేరు కూడా ఒకటి’ అంటున్నారు వో రచయిత. పద రాగాల ప్రచ్ఛాయల్లో దాక్కునే నాకు పగలూ రాత్రీ ఒకటే కానేకాదు. బహుశ నేను సవితను కావొచ్చు. నా హృదయం పూచిన పాటలిని కావొచ్చు. శరత్ శ్రీకాంత్‌లోని కమల లతని కావొచ్చు. రాస్కల్నికోవ్ ఎవరి పాదాల దగ్గర కూచుని తన గాథ వినిపించాడో, ఆమెనే నేను కావొచ్చు. భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా భావించే నేను కావొచ్చు. అంతా సాపేక్షమయిన దునియాలో ఇది ఇదీ అది అదీ అని చెప్పలేను.

 నీ పనేమిటీ అంటే, పరామర్శించడమే నా పని. ఛిౌటౌజీజ ఛ్ఛ్ట్ఛిట లో నా పని అని చెపితే మీరు పరిహసించవచ్చు. అక్కడికి వొచ్చే బాధిత హృదయాలకి నేను సాంత్వననవుతాను అంటే మీరు నవ్విపోవచ్చు. ఏదైనా డబ్బువొచ్చే పనేనా అంటే, దానికీ జవాబు లేదు నిజంగా. పిల్లలెంతమంది అంటే ఏం చెప్పను? ఎవరైనా నా మాతృత్వ మధురిమలో ఓలలాడతానంటే వారికి తల్లినవుతానంటే మీకు అర్థంకాకపోవచ్చు. ‘ఎవరే ఎవరే నీ వారూ’ అంటే వెనక్కి వెనక్కి వెళ్ళి హిందూధర్మశాస్త్రం ప్రకారం వొక మాట చెప్పవచ్చు. నిశ్చితార్థమే పెళ్ళి కావొచ్చు అని. హిందూత్వాన్ని తమ భుజాల మీద మోసే ఏ శివానందులైనా ఈ చరిత్రహీనని, ఈ అకర్మణ్యురాలిని కాపాడగలిగితే. కానీ వారికైనా నేనొకటి విన్నవించుకోవాలి. నేను ఇంతవరకూ ఏ నమూనాలోనూ లేను అని. నాకు ప్రేమ కావాలి. స్వేచ్ఛ కావాలి. రక్షణ కావాలి. సంప్రదాయ సంస్కృతీ కావాలి. నేను ప్రపాపాలికను.

 నా ఆత్మకే ఏకంగా ముడిపడిన కళాత్మకత వొక దాహం. అపుడు నేను శేషేంద్రలా నా నివాసాన్ని నక్షత్రలోకాలలో వున్న గృహానికి వెళ్లిపోతా. అక్కడ నేనొక ‘నిర్వికల్ప సంగీతం’లోకి వెళతాను. నేను అపుడు రాస్తున్న కవితనవుతాను. కొంతసేపు కళాత్మక పద ‘బంధనఛాయ’లో వుంటాను. అక్కడొక వన్యపుష్పాన్నవుతాను. శ్రీకాంత్‌ని ఆశ్రయిస్తాను. (అతడే రాజ్యలక్ష్మిని ఆశ్రయించాడని వెక్కిరిస్తారా?) సవితలో మమేకమవుతాను. నేనొక రాగ ప్రవాహాన్ని. ప్రవాహంలో దేన్నీ వెదకకు. ఏదో కుతూహలంతో అనల్పమైన సంగతుల కోసం అసలే వెదకకు.

 ‘ఎక్కడికి పయనించానో తెలీదు/హృదయం వొక నావ అయింది/ఎవరిని కలిశానో తెలీదు/ఒక సమాగమం పూర్తి అయింది.’
 
ఒక బంధం మెడలో లేకపోయినంత మాత్రాన ఎందుకు అశ్లీల పరిభాషతో అవమానిస్తారు? అది వుంటే, ఫలానా వారి తాలూకా అని చెప్పవచ్చు. అపుడైనా అసలు నాకు ‘నేనంటే ఎవరూ’ అన్న ప్రశ్న తెగదు. ఇపుడయినా పైట భుజాల చుట్టూతా కప్పుకుని హిందువులకి కళంకాన్ని తీసుకురాను. కళంకిత దేహమా, ఆత్మనా ఏది?

నేను ఏమయినా ఈ శతాబ్దానికి చెందనిదాన్ని. ఈ వ్యవస్థకు సరిపడను లేదా ఈ సిస్టమ్‌లో ఇమడలేని దాన్ని. అందుకనే నన్నెవరూ అని అడగవద్దు. నేను బుద్ధిజీవిని కాను. ఎలా జీవించకూడదో, ఎలా జీవించాలో నిర్ణయించడానికి. నేను పగిలిన బెల్జియం అద్దాన్ని. అవమాన భారంతో కళ్ళు పెకైత్తి చూడలేను ఒక్కోసారి. చీకటి కాంతి స్వప్నాన్ని. నేను రాగహీనను, రాగలీనను.

మునుపు ఎవరైనా ఒక కల చేతిలో పెట్టి వెళ్ళిపోతారేమోనని చూసేదాన్ని. ఇపుడు కలలకి దూరమైనాను. దేహాన్ని దాటి నా స్వప్నలోకాలని చూడలేని వాళ్ళు నా చేతిలో స్వప్నాలని ఎలా? కలలన్నీ దేహానికి సంబంధించిన హార్మోన్స్ కెమిస్ట్రీ కదా. ఆ నేను ఇపుడు లేను. ఆత్మకి సంబంధించిన స్వప్నం...
శివలెంక రాజేశ్వరీదేవి
 
 (శివలెంక రాజేశ్వరీదేవి స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954 జనవరి 16. 1970లలో రచనా వ్యాసంగం ఆరంభించారు. ‘రాజేశ్వరీదేవి గుంపున ఎపుడూ లేరు. జీవితంతో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా జాగరణ చేశారు. ఆ కలత, కలవరింతలే ఆమె కవిత్వం. 2015 ఏప్రిల్ 25న నక్షత్రలోకంలోకి ఎగిరిపోయారు’. పైలేఖ ఆమె మూడేళ్ల క్రితం నామాడి శ్రీధర్‌కు రాసింది! శ్రీధర్ సంపాదకుడిగా వచ్చిన రాజేశ్వరీదేవి కవితల, స్మృతుల సంకలనం ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’లో ఈ లేఖ కూడా ఉంది. పుస్తక ప్రచురణ: ప్రేమలేఖ; ఫోన్: 9396807070)

మరిన్ని వార్తలు