భేషైన చట్టం

26 Jul, 2017 02:04 IST|Sakshi
భేషైన చట్టం

కుల వివక్ష, నిమ్న వర్గాలపై ఆధిపత్య కులాల ఆగడాలకు సంబంధించిన వార్తలు తరచు కనబడుతున్న దేశంలో సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా తొలిసారి చట్టం వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఈ విషయంలో చొరవ తీసు కున్నది కులపరమైన ఆగడాలు, పెత్తందారీ పోకడలు విస్తృతంగా కనబడే ఉత్తరాది రాష్ట్రాల్లో కాదు. జాతీయ స్థాయిలోనూ కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ దురాచారానికి వ్యతిరేకంగా చట్టం చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. గోపాల్‌ హరి దేశ్‌ముఖ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహూ మహరాజ్, విఠల్‌ రాంజీ షిండే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌లు పుట్టిన మహారాష్ట్ర అనేక సంఘ సంస్కరణోద్యమాలకు వేదికగా నిలిచింది.

కులాధిక్య భావన లనూ, అంటరానితనాన్ని, సంప్రదాయం ముసుగులో కొనసాగే అరాచకాన్ని రూపుమా పడం కోసం వీరితోపాటు మరెందరో కృషి చేశారు. కానీ సమాజం నుంచి ఆ దురాచారాలు విరగడ కాలేదు. సరిగదా ఈ పోకడలు నిమ్నకులాల్లో కూడా విస్త రించాయి. నాలుగేళ్లక్రితం మహారాష్ట్రలో షెడ్యూల్‌ కులానికి చెందిన యువకుడు దీపక్‌ కాంబ్లేను ప్రేమించి పెళ్లాడి కుటుంబం పరువు తీసిందని ఆగ్రహించి 22 ఏళ్ల ప్రమీలా కుంభార్కర్‌ అనే యువతిని ఆమె తండ్రే హత మార్చాడు. వారిది సంచారజాతి. పెళ్లి కారణంగా జాతినుంచి తమ కుటుంబాన్ని వెలేయడం అతని ఆగ్రహానికి మూలం.

ఆ ఉదంతం మహారాష్ట్రను ఓ కుదుపు కుదిపింది. ఇలాంటి వివక్షపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ హేతువాద ఉద్యమ కారుడు నరేంద్ర దభోల్కర్‌ తన హత్యకు కొద్ది నెలల ముందు ఉద్యమం నిర్మిం చిన పర్యవసానంగా ఈ చట్టం వచ్చింది. మహారాష్ట్రలో సాంఘిక బహిష్కరణ జాడ్యం కులాంతర వివాహాలు ఎక్కువగా చోటుచేసుకునే రాయగఢ్, రత్నగిరి, నాసిక్‌ జిల్లాల్లో ఉంది. వీటికి వ్యతిరేకంగా కేసులు పెట్టినప్పుడు చట్టాల్లోని లొసు గులను ఆసరా చేసుకుని దోషులు సులభంగా తప్పించుకుంటున్నారు. దాదాపు ప్రతి కులంలోనూ కుల పెద్దలుగా చలామణి అవుతున్నవారు జాతి పంచాయ త్‌లు ఏర్పాటుచేసి ఇలాంటివి అమలు చేస్తున్నారు.

అమలులో ఉన్న చట్టాలు, చేయాల్సిన చట్టాలు సమాజ స్థితిగతులకు అద్దం పడతాయి. పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాల హరణకు బ్రిటిష్‌ వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఎంత అవమానకరమో... అట్టడుగు వర్గాల మనుగడకూ, వారి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ ముప్పుగా పరిణ మించిన దురాచారాల అంతానికి చట్టాలు లేకపోవడం కూడా అంతే అవమా నకరం. షెడ్యూల్‌ కులాలు, తెగలవారిపై భిన్న రూపాల్లో అమలవుతున్న వివ క్షలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడానికే దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టింది. ఆ చట్ట నిబంధనలను నోటిఫై చేయడానికి మరో ఆరేళ్లు పట్టింది. నిజా నికి మన రాజ్యాంగంలోని 15వ అధికరణ పౌరులపై కులం, జాతి పేరిట వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తోంది. అంటరానితనాన్ని 17వ అధికరణ నిషేధిస్తున్నది. కానీ ఈ అధికరణలకు అనుగుణంగా చట్టం తీసుకురావడానికి ఇంత సుదీర్ఘ కాలం పట్టింది.

చట్టాలు తీసుకురావడం ఒక ఎత్తయితే వాటి అమలు మరో సమస్య. చట్టం అమలుకు పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, వివక్షకు సంబంధించిన కేసులు ఎక్కడ వెల్లడైనా సత్వరం స్పందించి కఠినంగా వ్యవహరించడం లాంటివి చేయకపోతే ఆ చట్టాలంటే సమాజంలో భయభక్తులు ఏర్పడవు. ఆంధ్రప్రదేశ్‌లోని గరగపర్రులో దళిత కులాలకు చెందినవారు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసుకోవడాన్ని సహించలేని ఆధిపత్య కులాలు ఇతర కులాలను సమీకరించి వారిపై సాంఘిక బహిష్కరణకు పూను కోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ బహిష్కరణ కారణంగా దళిత కులాల పౌరులు రెండు నెలలకుపైగా ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నా, ఆ గ్రామంలో జరుగుతున్న వివక్ష గురించి జిల్లా యంత్రాం గానికి తెలిసినా చర్యలు తీసుకోవడంలో తీరని జాప్యం జరిగింది. సుదీర్ఘ ఉద్య మం తర్వాత మాత్రమే ఆ గ్రామ దళితులకు ఉపశమనం లభించింది.

మహారాష్ట్ర తెచ్చిన కొత్త చట్టం సాంఘిక బహిష్కరణకు ఇచ్చిన నిర్వచనం విస్తృతమైనది. ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను సామాజిక, మత, కులపరమైన ఉత్సవాల్లో, సభల్లో, సమావేశాల్లో పాల్గొనకుండా నిరోధించినా... వారి స్వేచ్ఛకు అడ్డుతగిలినా అందుకు కారకులైనవారిపై చర్య తీసుకోవాలని నిర్దేశిస్తున్నది. నైతి కత, లైంగికత, రాజకీయ అభిప్రాయాలు వగైరాల పేరిట సంఘ బహిష్కరణకు పాల్పడినా... ఆ కుటుంబాలకు స్మశానాలు, కమ్యూనిటీ హాళ్లు, విద్యాసంస్థలు వగైరాల్లో అనుమతి నిరాకరించినా, వారి పిల్లలను క్రీడాస్థలాల్లోకి రాకుండా అడ్డు కున్నా అది సాంఘిక బహిష్కరణగా పరిగణించాలని చెబుతోంది.

ఈ కేసుల్లో నేరం రుజువైనవారికి మూడేళ్ల వరకూ జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరి మానా లేదా రెండూ విధిస్తారు. చార్జిషీటు దాఖలు చేసిన ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని చట్టం చెబుతోంది. అయితే నిందితులకు సులభంగా బెయిల్‌ లభించేవిధంగా నిబంధనలుండటం ఈ చట్టంలోని ప్రధాన లోపం.  బాధితులకు సాంఘిక బహిష్కరణ తెచ్చిపెట్టే సమస్యలు సామాన్యమైనవి కాదు. ఉన్నచోట పనులు దొరకవు. వారితో ఎవరూ సంబంధబాంధవ్యాలు పెట్టుకోరు. దుకా ణాల్లో వారికి నిత్యావసర సరుకులు అమ్మరు. కనీసం మంచినీళ్లు కూడా పుట్టవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉన్న ఊరు వదలకతప్పదు. నిందితులకు ఎంతో పట్టు ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు. అలాంటివారికి సులభంగా బెయిల్‌ వచ్చే ట్టయితే అది వారి మనోస్థైర్యాన్ని పెంచుతుంది. కనుక బెయిల్‌కు సంబంధించి కఠిన నిబంధనలుండటం శ్రేయస్కరం. ఏదేమైనా మహారాష్ట్రను ఆదర్శంగా తీసు కుని కుల పంచాయతీల పట్టు ఎక్కువుండే హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాలు సైతం ఈ తరహా చట్టం తీసుకురావాలి. జాతీయ స్థాయిలో ఈ మాదిరి చట్టం వస్తే అది మరింత మంచిది.
 

మరిన్ని వార్తలు