గురి చూశాకే తుపాకీ పేలుస్తున్నారా?

27 Nov, 2016 01:34 IST|Sakshi
గురి చూశాకే తుపాకీ పేలుస్తున్నారా?

అవలోకనం
నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని  కోరుకుంటున్నాను. గొప్ప ఆలోచనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా మన ప్రధానికి ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది.
 
యూరోపియన్ యూనియన్ ఏర్పాటు అనే భావనకే ఫ్రెంచి నేత జిస్‌కార్ డెస్టాంగ్ పులకరించి పోయేవాడుగానీ, దాని వివరాలు మాత్రం ఆయనకు విసు గెత్తించేవని అంటారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే చాలా అంశాలలో అదే ధోరణి కనిపిస్తున్నదేమోనని తరచూ నాకు అనుమానం కలుగుతుంటుంది. నరేంద్ర మోదీ నల్ల ధనంపై భారీ దాడిని ప్రారంభించిన తదుపరి గడచిన రెండు వారా లకు సంబంధించి రెండు వాస్తవాలను ఒప్పుకోవడం సమంజసం. ఒకటి  ఇంతటి అసౌకర్యం తర్వాత కూడా మోదీ తనకున్న విస్తృతమైన ప్రజా మద్దతును నిల బెట్టుకుంటున్నారు. రెండు నగదు కొరత వల్ల తలెత్తుతున్న ఆర్థిక సమస్యలు పేరు కుపోతూనే ఉన్నాయని వార్తా నివేదికలు తెలుపుతున్నాయి.
 
అది సూరత్ నుంచే అయినా లేదా లూథియానా లేదా మొరాదాబాద్ వంటివే అయినా మన వస్తుతయారీ కేంద్రాలన్నిటి నుంచి వస్తున్న వార్తా నివే దికలన్నీ ఒకేలా ఉంటున్నాయి. వస్తుతయారీ యూనిట్లు తక్కువ ఉత్పత్తి సామ ర్థ్యంతో పని చేస్తున్నాయనో లేదా మూత పడ్డాయనో తెలుపుతున్నాయి. అవి తయారు చేసే వస్తువులకు గిరాకీ లేకపోవడమూ, ముడి పదార్థాల కొనుగోలుకు నగదు అంటుబాటులో లేకపోవడం అందుకు కారణం. అవి శ్రామికులను పనిలో కొనసాగించడానికి విముఖతను చూపడం, వలస కార్మికులను తొలగించడం లేదా వారి స్వస్థలాలకు పంపివేయడం సర్వత్రా కనిపిస్తున్న మరో సామాన్యాంశం. దీనికి సంబంధించిన సరైన గణాంక సమాచారం కోసం మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయినాగానీ ఘటనల నివేదికలు పరిస్థితిని సూచించే సంకే తాలు అయినట్లయితే డిసెంబర్‌లోనూ, కొత్త సంవత్సరంలోనూ ఇంకా పెద్ద సమస్య తలెత్తనున్నదని అనిపిస్తుంది.
 
ఉద్దేశపూర్వకంగా కొని తెచ్చుకున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా మోదీ జనాదరణ విస్తృతమైనదిగానూ, భారీగానూ ఉన్నదనేది నిర్వివాదాంశం. ఇందుకు కారణంఏమిటి? ఇది మోదీ పదవీ కాలం నట్ట నడుమకు చేరిన సమయం కూడా కాబట్టి ఆ విషయాన్ని పరిశీలిద్దాం. అద్భుతమైన పథకాలను ప్రారంభించడం, గొప్ప ప్రకటనలను చే యడమే ఇంతవరకు గడచిన మోదీ పాలనలో కనిపించే విశిష్ట లక్షణం. ఇవన్నీ ప్రజల దృష్టిని, ప్రత్యేకించి మీడియా దృష్టిని ఆకట్టుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా, బుల్లెట్ ట్రైన్, స్మార్ట్ నగరాలు, స్వచ్ఛ భారత్, లక్ష్యిత దాడులు, పెద్ద నోట్ల రద్దు వగైరా.  ఇవన్నీ, ఇంకా ఇతరత్రా మోదీ చొరవ చూపిన అంశాలన్నిటిలో ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఇవన్నీ గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. పాతను, కృశించిపోతున్నదాన్ని తుంచి పారేసి, దాని స్థానంలో కొత్తదాన్ని, మరింత మెరుగైనదాన్ని తెస్తామని వాగ్దానం చేసేవి. అవి ఈ లక్ష్యాన్ని ఏ మేరకైనా సాధించాయా? వాటి నిజ పర్యవసానాలు ఏమిటి? కాలక్రమేణానే   అవి మనకు తెలుస్తాయి.
 
ఒక ఉదాహరణను చూద్దాం. ఉడీ ఉగ్రదాడి తదుపరి జరిపిన లక్ష్యిత దాడులు... వాస్తవాధీన రేఖకు అవతల నుంచి పంపుతున్న వారు చేస్తున్న హింసా కాండకు ప్రతిస్పందనగా చేసినవి. ఆ తదుపరి మనం 20 మంది సైనికులను కోల్పోయాం. లక్ష్యిత దాడులకు ముందు సాపేక్షికంగా శాంతియుతంగా ఉండిన వాస్తవాధీన రేఖ ఆ తదుపరి భగ్గున మండుతుండటమే అందుకు ప్రధాన కారణం. తిరిగి కాల్పుల విరమణ నెలకొన్నదని మన రక్షణ మంత్రి అంటున్నారు. అయితే ఈలోగా 20 మంది భారత సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి లక్ష్యిత దాడులను జరపాలనేది మంచి నిర్ణయమేనా? ఈ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పినా అది జాతి వ్యతిరేకమైనదే అవుతుంది. కాబట్టి దీన్ని ఇంత టితో వదిలేద్దాం. ఏదేమైనా భారత సైనికుణ్ణి ఆరాధించవ లసిందే. అతడు తనం తట తానుగా ఆత్మబలిదానాలు చేయాల్సిందేనని నేనంటాను. సైనికుడు దేశం కోసం చేసిన త్యాగాల పట్ల మనకు పూజ్యభావం ఉన్నదే తప్ప, అతని ప్రాణాల పట్ల గౌరవం మాత్రం లేదు.

ప్రధాని మోదీ గొప్ప ప్రకటనల పర్యవసానాల వల్ల ప్రయోజనాలు కలిగే దెవరికో, నష్టపోయేది ఎవరో మనకు కచ్చితంగా తెలియదు. చాలా వరకు ప్రకటనల తీరు ఇంతేనని చెప్పుకోవచ్చు. అయితే నల్ల ధనంపై చేపట్టిన లక్ష్యిత దాడి నిజ ఫలితాలు ఏమిటో తెలియడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందనే మాట నిజమే. కానీ మనం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ మాటేమిటి? అణు సరఫరాదారుల గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ) స్థానాన్ని సాధించడానికి మనం వెచ్చిస్తున్న దౌత్యశక్తి, ప్రధాని వ్యక్తిగత ప్రతిష్టల సంగ తేమిటి? వాటి పర్యవసానాలను గురించి అవసరమైనంత లోతైన విశ్లేషణ జరిపారా? నేనిక్కడ ఉద్దేశాలను ప్రశ్నించడం లేదు. కాకపోతే ముందుగా తుపాకీ పేల్చి, తర్వాత గురి చూడటం అనే వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తున్నదేమోననే నా అనుమానం నిరాధారమైనదేనా? అని తెలుసుకోవాలనే నా కుతూ హలమంతా.
 
నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్ని కల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప ఆలో చనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా ఆయనకు ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది.
 

ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఈ-మెయిల్ : aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు