2015 ఆశావహంగా నడిచింది!

2 Jan, 2016 00:53 IST|Sakshi

సర్‌ప్రైజుల మీద సర్‌ప్రైజులిస్తూ, తరుచు సెల్ఫీలు దిగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు ప్రధాని మోదీ. ఒంటె మీద బరువులెక్కించే వారు ఒక పద్ధతిని పాటిస్తారు. ఒంటె కాళ్ల కింద ఇటుకలు పెట్టి అవి చితికేదాకా బరువులు వేస్తారు. అప్పుడు దాని మూలుగు విని ఒక వీశెడు బరువుని భారంగా దించినట్టు నటిస్తారు. వెర్రి ఒంటె హాయిగా నిట్టూర్చి నడక సాగిస్తుంది. ఈ గ్యాసు వార్తలు అవీ వింటుంటే దే శ ప్రజలు వెర్రి ఒంటెల్లా కనిపిస్తున్నారు.

 ఏమాటకామాటే చెప్పుకోవాలి. 2015 ఎంతో ఆశావహంగా గడిచింది. ప్రస్తుతం ఉమ్మడి క్యాపిటల్ నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాటలన్నీ కలసే ఉంటాయి. ఇద్దరిదీ మాటల్లో ఒకే చాకచక్యం. చేతల్లో ఒకేరకం చాణక్యం. ఒకర్ని మించిన వాగ్ధాటి మరొకరిది. మొత్తం మీద ఇరువురూ శనగలు తింటూ ప్రజల చేత ఉలవలు తినిపించినవారే. వరల్డ్ క్లాస్ సిటీకి శంకుస్థాపన చేశామని ఒకరంటే, ఇప్పటికే భాగ్యనగరం విశ్వనగరం అయిపోయిందని మరొకరు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద ఎండమావిలో లేత కొబ్బరి నీళ్లు తాగిస్తున్నారు. ప్రజలు ఒక భ్రమలో ఆ విధంగా ముందుకు పోతావున్నారు. ఇంగో పక్క ప్రతిష్టాత్మకంగా నదుల అనుసంధానం జరిగిపోతావుంది. ఇక్కడ చూస్తే మూసీనది మూడొందల సంవత్సరాల నాటి స్వచ్ఛతతో ప్రవహిస్తోంది. దుష్టపాలనలో ఉమ్మడి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. క్షాళనకు కంకణం కట్టుకున్నాం. మిషన్ కాకతీయ కేకతీయగా మూడు చెరువుల నీళ్లు తాగించనుంది. నేను టెక్నాలజీకి ఆది పురుషుణ్ణి. కరెంటు తీగెల్లోంచే సర్వస్వం సరఫరాకి ఆలోచిస్తున్నాం. కరెంటు, నీళ్లు, గ్యాస్ , చానల్స్ సర్వం ఒకే గొట్టం ద్వారా అందేటట్టు ‘ఏకగొట్ట విధానానికి’ రూపకల్పన చేస్తున్నాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నానని కూడా మీకు మనవి చేస్తున్నాను.

 మునుపు, వచ్చే అయిదేళ్లలో ఎంతమంది కొత్త ఓటర్లు జాబితాలోకి వస్తారని లెక్కలు వేసేవారు. ఇప్పుడు ఎంత మంది మందుబాబులు వచ్చి కలుస్తారని గణాంకాలు వేస్తున్నారు. ఎందుకంటే సర్కార్లన్నీ లిక్కరే ఇంధనంగా నడుస్తున్న మాట నిజం. ఇవాళ ఓటు హక్కుని మించిందీ మందు హక్కు. వయసొచ్చిన వారికి ఓటు నిజంగానే ప్రాథమిక హక్కా? అయితే అన్ని లక్షల మంది మహానగర ఓటర్లు జాబితా నుంచి ఎలా చెరిగిపోయారో తెలియదు. అయినా ఎలా, ఎందుకు, ఎవరు చెరిపేశారన్న సంగతి తేల్చరు. ఏమీ వర్రీ అవద్దు, మళ్లీ ఓటు భిక్ష పెడతామని హామీ ఇస్తున్నారు.

 సూర్యోదయం అయింది గాని మా బతుకుల్లోకి వెలుగు రాలేదని బడుగు ప్రజ వాపోతోంది. ఆధార్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ జీవితం పండినట్టే అన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవండి. అవి మీ పాలిట అక్షయ పాత్రలవుతాయన్నారు. స్వచ్ఛ భారత్ తో అంతా మహాశుభ్రమన్నారు. మనసులో మాటలో మానసిక విశ్రాంతి అన్నారు. సర్‌ప్రైజుల మీద సర్‌ప్రైజులిస్తూ, తరుచు సెల్ఫీలు దిగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు ప్రధాని మోదీ. ఒంటె మీద బరువులెక్కించే వారు ఒక పద్ధతిని పాటిస్తారు. ఒంటె కాళ్ల కింద ఇటుకలు పెట్టి అవి చితికేదాకా బరువులు వేస్తారు. అప్పుడు దాని మూలుగు విని ఒక వీశెడు బరువుని భారంగా దించినట్టు నటిస్తారు. వెర్రి ఒంటె హాయిగా నిట్టూర్చి నడక సాగిస్తుంది. ఈ గ్యాసు వార్తలు అవీ వింటుంటే దే శ ప్రజలు వెర్రి ఒంటెల్లా కనిపిస్తున్నారు.

(వ్యాసకర్త శ్రీరమణ ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు