కాంగ్రెస్‌లో సణుగుడు

17 Mar, 2017 00:40 IST|Sakshi
కాంగ్రెస్‌లో సణుగుడు

చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు వినబడుతున్నాయి. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ వరస ఓటములు చవిచూస్తున్న పార్టీకి ఇదేమీ వింతకాదు. అలా జరగకపోతేనే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మణిశంకర్‌ అయ్యర్‌ వంటి సీనియర్‌ నేతలు మొదలుకొని ప్రియా దత్‌ వరకూ... సత్యబ్రత్‌ చతుర్వేది నుంచి సందీప్‌ దీక్షిత్‌ వరకూ ఎవరికి వారు బాహాటంగా మాట్లాడుతున్నారు. గుండెకే శస్త్ర చికిత్స జరగాలని ఒకరంటే... పార్టీకి ఆటో ఇమ్యూన్‌ వ్యాధి పట్టుకున్నదని మరొకరం టున్నారు. నాయకత్వం మారితే తప్ప ఫలితం ఉండదని ఇంకొకరు చెబుతున్నారు. సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా అవసరమైన మార్పులకు సిద్ధపడతామో లేదో తేల్చుకోవాలని మరొకరు సూచిస్తున్నారు. అసలు నాయకత్వం వహించడం మాట వదిలిపెట్టి కూటమి ఎత్తుగడలకు సిద్ధపడమని మణిశంకర్‌ అయ్యర్‌ హితవు పలికారు. ఎవరు అడిగినా అడగకపోయినా ఓటమి దాపురించినప్పుడు ఆత్మ పరిశీ లన చేసుకోవడం సారథులుగా ఉన్నవారికి తప్పనిసరి.

సీనియర్‌ నేతలను పిలవడం జరిగిన తప్పిదాలేమిటి... లోటుపాట్లేమిటన్న అంశాలను చర్చించడం కూడా అవసరం. కానీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను వీటన్నిటికీ అతీత మన్నట్టు వ్యవహరిస్తారు. తాజాగా వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన తీరు మారలేదు. ‘విపక్షంలో ఉన్నప్పుడు ఎగుడు దిగుళ్లుంటాయి, తప్పదు. ఉత్తరప్రదేశ్‌లో మేం కాస్త దెబ్బతిన్నాం... అంతే’ అంటూ ఆయన నిర్వికారంగా మాట్లాడటాన్ని చూసి పార్టీలోని సీనియర్‌లు బెంబేలెత్తుతు న్నారు. యూపీ పరాభవం ఎలాంటిదో ఆయనకు బొత్తిగా అర్ధమైనట్టు లేదన్నదే వారి బాధ. ఆ రాష్ట్రం కాంగ్రెస్‌ను దశాబ్దాల క్రితం మరిచిపోవడం నిజమే అయినా ఇప్పుడు తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఈ ఎన్నికల్లో పాలకపక్షమైన సమాజ్‌వాదీ పార్టీతో కట్టిన కూటమి ఏమాత్రం కలిసిరాకపోగా ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఆ పార్టీ సింగిల్‌ డిజిట్‌కు పడి పోయింది. కలిసి పోటీచేద్దాం... రారమ్మని సమాజ్‌వాదీ పిలిచినప్పుడు తన స్థోమ తేమిటో, స్థాయేమిటో గ్రహించుకోకుండా ఇదే అదునని 150కి తక్కువైతే కుదరదని కాంగ్రెస్‌ బేరాలకు దిగింది. గత్యంతరం లేదు గనుక చివరకు అఖిలేష్‌ 105 స్థానాలు ఇవ్వకతప్పలేదు.

అతి చిన్న పార్టీగా అందరూ భావించే అప్నాదళ్‌ బీజేపీ ఇచ్చిన 11 స్థానాలూ తీసుకుని 9 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్‌ ఏడుకు పరి మితమై చిన్నబోయింది. సమాజ్‌వాదీ, బీఎస్‌పీలు కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగా చూసిన రోజుల్లో కూడా ఒంటరిగా బరిలోకి దిగి ఇరవయ్యో, పాతికో గెల్చుకుంది. ఇప్పుడు అంతకన్నా హీనస్థితిలో పడిపోయింది. రాహుల్‌ ప్రాతినిధ్యం వహించే అమేథీ పరిధిలోని అయిదు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఓడిపోయింది. సోనియా నియోజకవర్గం రాయ్‌బరేలీ పరిధిలోని అయిదు స్థానాల్లో రెండుచోట్ల మాత్రం పార్టీ గట్టెక్కింది. అమేథీ, రాయ్‌బరేలీలు రెండూ కాంగ్రెస్‌ కంచుకోటలు. కష్టకాలంలో కూడా ఆ పార్టీకి అండగా నిలబడిన ఆ కోటలు కూడా ఇప్పుడు కూలి పోయాయి.  

పంజాబ్‌లో పార్టీ విజయాన్ని... గోవా, మణిపూర్‌లలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించడాన్ని చూపి ఉత్తరప్రదేశ్‌ పరాభవాన్ని, దాని సారాన్ని మరుగున పరచా లనుకున్నవారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. పంజాబ్‌లో వరసగా రెండుసార్లు అధికారంలో ఉండటం వల్ల అకాలీదళ్‌–బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. అది ఓటమిపాలు కావడం అనివార్య మని చాలా ముందుగానే తేలిపోయింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) వ్యూహాత్మకంగా అడుగులేసి ఉంటే ఆ పార్టీకే విజయం దక్కేది. ముఖ్యంగా నవజోత్‌సింగ్‌ సిద్ధు చేతులు కలపడానికి సిద్ధపడినప్పుడు ఆప్‌ మీనమేషాలు లెక్కించడం కాంగ్రెస్‌కు వరమైంది. గోవా, మణిపూర్‌లలో పెద్ద పార్టీగా అవతరించినా అది నిమ్మకు నీరెత్తి నట్టు ఉండిపోవడంతో బీజేపీ చకచకా పావులు కదిపింది. ఫలితాలొచ్చిన వెంటనే గవర్నర్‌లను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించమని అడిగి ఉంటే వేరుగా ఉండేది. వారు ఆచితూచి అడుగేయక తప్పని స్థితి ఏర్పడేది.

గోవాలో అయితే కనీసం కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవడమన్న సమస్య ఉంది. మణిపూర్‌లో అదేమీ లేదు. సీఎంగా ఇబోబీ సింగ్‌ ఉన్నారు. పెద్ద పార్టీగా తననే ఆహ్వానిస్తే బలనిరూపణ చేసుకుంటానని ముందుగా వెళ్లి ఆయన చెప్పలేకపోయారు. అంతో ఇంతో మెరుగ్గా ఉన్నచోట కూడా పార్టీ ఇలా నిస్తేజంగా మిగిలిపోవడం ఎంత విషాదం! గోవాలో తమకు అన్యాయం జరిగిపోతున్నదని సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టిన ప్పుడు కూడా ధర్మాసనం అడిగిన మొదటి ప్రశ్న గవర్నర్‌ను ఎందుకు కలవలే దన్నదే. ఆ ప్రశ్నకు కాంగ్రెస్‌ దగ్గర జవాబు లేదు. పెద్ద పార్టీగా ఆ రెండు చోట్లా తమ వంతు ప్రయత్నం తాము చేయాలని రాహుల్‌కు తట్టకపోతే పోయింది...   దశాబ్దాలుగా కోటరీ ముఖ్యులుగా చలామణి అవుతున్న నేతలంతా ఏమయ్యారు? వారి అనుభవమంతా

ఎటుపోయింది?
పార్టీ ఇప్పుడున్న తీరు సరిగా లేదని ఎవరివరకో ఎందుకు... రాహుల్‌గాంధీకే అనిపిస్తోంది. 2014లో ఓడిపోయిన వెంటనే ఆయన ఈ మాటన్నారు. పార్టీ అధ్యక్ష స్థానంలో తన తల్లి, ఉపాధ్యక్ష స్థానంలో తాను ఉండి ఇలా అనడం అయో మయానికి దారితీస్తుందని ఆయన గ్రహించలేకపోయారు. ఒక దాని తర్వాత మరొకటిగా వచ్చిపడుతున్న ఎన్నికల వల్ల పార్టీ అంతర్మథనానికి తీరిక చిక్కడం లేదని కొందరంటున్న మాటలు చెల్లుబాటు కావు. బీజేపీకి మాత్రం ఆ పరిస్థితి లేదా? ఆ పార్టీ బిహార్‌లో దెబ్బతిన్నాక గుణపాఠం నేర్చుకోలేదా? ఏదో ఒక సాకుతో ఇలాగే కాలక్షేపం చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆయన తెలుసుకోవడం లేదు. వచ్చే ఏడాది కర్ణాటక, గుజరాత్, హిమాచల్, త్రిపుర, మిజోరం ఎన్నికలుంటాయి. అప్పుడీ స్వరాలు మరింత బిగ్గరగా వినబడతాయి. ఆ తర్వాత ఎటూ లోక్‌సభ ఎన్నికలు తప్పవు. ఈ దశలోనైనా సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కాకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని రాహుల్‌ గ్రహించడం ఉత్తమం.

మరిన్ని వార్తలు