ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!

1 Oct, 2016 00:58 IST|Sakshi
ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!

అక్షర తూణీరం
‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’ అని మరోసారి సర్ది చెప్పాడు సాటి మిత్రుడు.
 
రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ముఖతా ‘‘ఆనంద ఆంధ్రప్రదేశ్’’ ఆవిష్కృతమైంది. అంతకు ముందు దోమరహిత రాష్ట్రంగా చేయాలని నిర్భయంగా తీర్మానించారు. దానికిముందు కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి కంకణ బద్ధులైనారు. చక్కని ఆలోచనలు చేస్తున్నారు. వింటుంటే పిచ్చి సంతోషంగా ఉంది. మన నేత ఏమి చెయ్యలేరో చెప్పడం కష్టం. ఆయన తలచుకుంటే డ్రోన్‌లతో దోమలకు పొగ పెట్టగలరు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పుష్కరాల రేవుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు గజ్జెలు కట్టి, తెరలు తీయనున్నారు. ఒకవైపు నాట్యాలు, ఇంకోవైపు గాన గోష్ఠులు, ఆవైపు కవి సమ్మేళనాలు, ఈవైపు జానపద కళారీతులు - కృష్ణా తరంగాలు నవరసా లొలికిస్తూ సాగిపోతుంటాయి.

మల్టీఫ్లెక్స్‌లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అవి రెక్కలు తొడుక్కుని అమరా వతి పరిసరాల్లో వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నిన్నటి మానిఫెస్టో లక్ష్యం. ఉద్యోగులు, శ్రామికులు, మరీ ముఖ్యంగా రైతులు ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మన తెలుగువారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వీధి కూడళ్ల దగ్గర సిగ్నల్స్ ఇస్తే కళాత్మకంగా ఉంటుంది. అవసరమైతే వారందరికీ సామూహిక శిక్షణ ఇప్పిస్తాం.
 
 ‘‘ఆనందమే బ్రహ్మ. ఆనందమే విష్ణువు. ఆనందమే యన్టీఆర్.’’ ఈ మూడోది నేవిన్లేదని ఒక రిక్షా కార్మికుడు వాదనకి దిగాడు. ‘‘ఇప్పుడు విన్నా వుగా’’ అంటూ సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. ‘‘నవ్వులో ఆనందం ఉంది. అదే విధంగా ఆనందంలో నవ్వు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాల’’ అనగానే ‘‘ఆయన నవ్వడం నేనెప్పుడూ చూడనేలేదురా’’ అన్నాడు నిష్టురంగా. ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’అని మరోసారి సర్ది చెప్పాడు.
 
  ‘‘ఇది కాదుగాని, చూడగా చూడగా ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్‌గా మారి పోతోందని నాకు సందేహంగా ఉందండీ’’ అంటూ ఒక పెద్దాయన ఇంద్రకీలాద్రి మొగలో నిలబడి టాపిక్ మార్చాడు. ‘‘అదెలాగ’’ అన్నాను. గోదావరి పుష్కరాలు మహోధృతంగా సాగినాయి. నెల్లాళ్లు ఆధ్యాత్మిక శోభ. దర్భలు, పిండాలు, స్నానాలతో గడిచింది. ఆనక కృష్ణా పుష్కరం. పైగా గోదావరి అంత్య పుష్కరం వచ్చి పడింది. ఆ రెండు పుణ్యనదులు బాబుగారి పుణ్యమా అని సంగమించి మహాతీర్థమై కూచుంది.

ఇదంతా ఒక నెలపాటు శ్రాద్ధ విధులతో, మంత్రాలతో తల్లడిల్లింది. రకరకాల హారతులతో మహానది వెలిగిపోయింది. ఇంతలో వినాయక ఉత్సవాలు ఓ రెండువారాలు భక్తిలో జనాన్ని ముంచెత్తాయి. ఆ పందిళ్లలోనే ఇప్పుడు అమ్మవారిని నిలుపుతున్నారు. శరన్నవరాత్రులు! ఇక కొండ మీదా సందడే. కొండకిందా సందడే. ఆయన సామాన్యుడు కాదు. అవసరమైతే బోలెడు కొత్త పండుగలు పుట్టించి ఆధ్యాత్మికాంధ్రప్రదేశం చేయడం ఖాయం’’ అంటూ అక్కడనించే దుర్గమ్మకి దణ్ణం పెట్టాడు.
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 - శ్రీరమణ

మరిన్ని వార్తలు