Ukraine Drone Attack On Russia: ఉక్రెయిన్ దెబ్బకి రష్యా ఉక్కిరిబిక్కిరి.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి.. 

29 Aug, 2023 17:53 IST|Sakshi

క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.     

అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు.    

తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని టోక్‌మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు.  

వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. 

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని..  భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. 

ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం

మరిన్ని వార్తలు