కఠిన చర్యలే మందు

18 Jul, 2017 03:51 IST|Sakshi
కఠిన చర్యలే మందు

పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ గోరక్షణ పేరుతో చెల రేగిపోతున్న మూకల గురించి మాట్లాడవలసి వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మత హింసను అరికట్టడానికి సహకరించమని కూడా ఆయన అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. గత నెలాఖరున అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆయన ఆవు పేరిట వివిధచోట్ల దాడులపై ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై పుట్టామన్న సంగతి మరిచి కొందరు హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇలాంటి దాడుల్లో బాధి   తులుగా మారుతున్నవారంతా ప్రధానంగా దళితులు, ముస్లిం, సిక్కులు. ఇవి ఏదో ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితమై లేవు. స్థాయీ భేదం ఉండొచ్చు తప్ప ఈశాన్య రాష్ట్రాలతో మొదలుపెట్టి దాదాపు అన్నిచోట్లా అవి అడపా దడపా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనలు ఇతరత్రా హింసాత్మక ఉదంతాలకు సైతం స్ఫూర్తినిచ్చాయి. 2015 అక్టోబర్‌లో ఆవు మాంసం ఇంట్లో ఉన్నదన్న అనుమా నంతో అఖ్లాక్‌ అనే ఒక కుటుంబ పెద్దను మూకలు కొట్టి చంపాయి. అతని కుమా రుణ్ణి తీవ్రంగా గాయపరిచాయి. గత నెల 22న ఈద్‌ పండుగ సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కుని ఉత్సాహంతో రైల్లో స్వస్థలం వెళ్తున్న పదిహేనేళ్ల బాలుడితో, అతని స్నేహితులతో కొందరు దుండగులు తగాదా పడి, మతం పేరుతో దూషిం చారు. ఆవును చంపి తినడం తప్పుకాదంటున్నాడని లేనిపోని మాటలు పుట్టిం చారు. తీవ్రంగా కొట్టి నడుస్తున్న రైలు నుంచి బయటకు నెట్టారు. ఆ బాలుడికి సకాలంలో వైద్య సాయం అందకపోవడంతో ప్లాట్‌ఫాంపైనే కన్నుమూశాడు. రాజస్థాన్‌లో నిరుపేద మహిళలు గత్యంతరం లేక కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు వారిని సర్కారీ సిబ్బంది ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నాడని ఆగ్రహించి జాఫర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని కొట్టి చంపారు. మూడు రోజులక్రితం యూపీలోని మొయిన్‌పురి వద్ద రైల్లో వెళ్తున్న ముస్లిం కుటుంబంపై గుంపు దాడి చేశారు. మరో స్టేషన్‌ సమీపించేలోపు తమ ముఠాను ఫోన్లు చేసి పిలిపించుకుని అందరూ కలిసి ఇనుప రాడ్లతో ఆ కుటుంబసభ్యులను తీవ్రంగా కొట్టారు. మహిళలు, పిల్లలు అన్న విచక్షణ కూడా చూపలేదు. కుటుంబంలో మతి స్థిమితం లేని బాలుణ్ణి కూడా వదల్లేదు.

ఇంత ద్వేషం, ఇంత అసహనం, ఇంత ఆగ్రహం ఈ గుంపులకు ఎక్కడినుంచి వస్తోంది? అకారణంగా ఎందుకిలా దాడులకు తెగిస్తున్నారు? కారణం స్పష్టమే. ప్రభుత్వాలు ఇలాంటి ఉదంతాల్లో ఉదాసీనంగా ఉంటున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించని పోలీసులపై చర్యలకు సిద్ధపడటం లేదు. దర్యాప్తు ఎలా జరుగుతున్నదో, చార్జిషీటు దాఖలులో జాప్యం, నిందితులకు బెయిల్‌ రావడం వగైరాలపై ఆరా ఉండటం లేదు. దానికితోడు కొందరు బీజేపీ నేతలు మొదలుకొని మంత్రి పదవుల్లో ఉన్నవారి వరకూ బాధ్యతారహితంగా మాట్లాడటం పరోక్షంగా గోరక్షణ పేరుతో రెచ్చిపోతున్న మూకలకు బలాన్నిస్తోంది. ఇలాంటి దౌర్జన్యాల అవసరం లేకుండానే గోరక్షణకు చట్టాలున్నాయి. వాటిని ఉల్లంఘించినవారిపై సమాచారమిస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకుంటాయి. అలా తీసుకోని పక్షంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావొచ్చు. కానీ దీన్ని వదిలిపెట్టి వీ«ధుల్లో స్వైరవిహారం చేయడం, హత్యలకు ఒడిగట్టడం, జనాన్ని భయపెట్టాలని చూడటం దారుణం. ఇలాంటి మూకలపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించడం హర్షించదగ్గదే. అయితే ఆ మాటను పదే పదే చెప్పించుకునే స్థితిలో ప్రభుత్వాలుండటం ఆందోళన కలిగిస్తుంది. శాంతిభద్రతల అంశం మౌలికంగా రాష్ట్రాల పరిధిలోనిది. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడేవారూ లేదా దాన్ని ప్రోత్స హించేవిధంగా మాట్లాడేవారూ ఏ పార్టీకి చెందినవారైనా వెనువెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఒక్క ఉత్తర్వు జారీచేస్తే పోలీసులు కాదంటారా? పాలకులుగా ఉన్నవారు చేతగానితనంతో ఉండిపోవడం వల్ల మాత్రమే ఇదంతా కొనసాగు తోంది. మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలనడం అభినందనీయమే అయినా అలాంటి ఉదంతాలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వ హించడం ద్వారా ఆ పార్టీలు ప్రభుత్వాల దృష్టికి తెస్తూనే ఉన్నాయి. కదలిక లేని దల్లా ప్రభుత్వాల్లోనే.

శాంతిభద్రతల విషయంలో విఫలమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సంజాయిషీ కోరడం అసాధారణమేమీ కాదు. గతంలో అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా చేస్తే కనీసం సంజాయిషీ ఇచ్చుకోవాలన్న భయంతోనైనా ప్రభుత్వాలు కదులుతాయి. మోదీ చెప్పారు గనుక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ దిశగా దృష్టి పెట్టాలి. ఎప్పుడెప్పుడు గోరక్షణ పేరుతో మూకలు దాడులకు, హత్యలకు దిగాయన్న అంశంపై సమగ్రమైన నివేదికలు తెప్పించుకోవాలి. ఆ ఉదంతాల్లో తీసుకున్న చర్యలేమిటో, అందుకు సంబంధించిన కేసుల దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, అందులో నిందితులకు శిక్షలు పడినవెన్నో సేకరించాలి. చర్యలు సరిగా లేవనుకున్నప్పుడు తగిన సూచనలు చేయాలి. ఆ విషయంలో ఏమవుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. బాధిత కుటుంబాలకు వైద్య చికిత్స, ఆర్ధిక సాయం, పునరావాసం ఏమేరకు అందాయో తెలుసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ముందు పార్లమెంటు ఉభయసభల్లో సమగ్రమైన చర్చ జరగాలి. అధికార, విపక్ష సభ్యులు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేయకుండా మూక దాడులను ఆపడానికి ఏం చేయాలన్న అంశంపై కేంద్రీకరించాలి. ప్రభుత్వం కప్పదాటు వైఖరిని విడనాడాలి. కొందరు సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నట్టు ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని సైతం పరిశీలించాలి. కేవలం మాటల వల్ల ఫలితం ఉండటం లేదని అర్ధమయ్యాక కఠిన చర్యలకు ఉపక్రమించడమే వివేకవంతమైన పని. అప్పుడు మాత్రమే చట్టబద్ధ పాలనలో ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అరా చకం అంతమవుతుంది.

మరిన్ని వార్తలు