లండన్‌ ఉగ్రదాడి

24 Mar, 2017 00:43 IST|Sakshi
లండన్‌ ఉగ్రదాడి

ఇతర సంపన్న దేశాలతోపాటు తాను కూడా నాయకత్వం వహించి అమలు చేసిన ప్రపంచీకరణ పర్యవసానాల నుంచి ఎలా బయటపడాలా అని బ్రిటన్‌ గుంజాటన పడుతున్నవేళ... ఆ దేశ రాజధాని లండన్‌లో బుధవారం ఉగ్రవాద దాడి జరిగింది. పార్లమెంటుకు కూతవేటు దూరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో అతనితో పాటు నలుగురు మరణించిన తీరు, అందుకు తామే బాధ్యులమంటూ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు ప్రకటించుకోవడం గమనిస్తే ప్రపంచంలో ఎలాంటి అభద్రతా వాతావరణం నెలకొని ఉన్నదో అర్ధమవుతుంది. దుండగుడు ఒక్కడుగా వచ్చి కారు నడుపుతూ వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జిపై ఇద్దరు పౌరుల్ని చంపేశాడు. దాదాపు 40మందిని గాయపరిచాడు.

పార్లమెంటు ఆవరణలోకి వెళ్లబోతుండగా అడ్డుకున్న పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఈ క్రమంలో మరో పోలీస్‌ అతన్ని కాల్చిచంపాడు. అనంతరం లండన్, బర్మింగ్‌హాం నగరాల్లో దాడులు చేసి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నిరుడు జూలైలో ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలోనూ, అనంతరం డిసెంబర్‌లో అదే దేశంలోని బెర్లిన్‌లోనూ అచ్చం ఈ తరహాలోనే ఉగ్రవాద దాడులు జరిగాయి. ఆ రెండుచోట్లా వాహనాలను ఇష్టాను సారం నడిపి జనం ప్రాణాలు తీశారు. నీస్‌ దాడిలో 86మంది ఉసురుతీస్తే, బెర్లిన్‌ దాడిలో 12మందిని పొట్టనబెట్టుకున్నారు.

వేర్వేరు దేశాల్లో ఇలా ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న ఐఎస్‌ తీరే వేరు. దాని అడుగుజాడలను పసిగట్టడానికి, దాని సానుభూతిపరులెవరో గుర్తించడానికి అవసరమైన పకడ్బందీ ఉపకరణాలు పాశ్చాత్య దేశాల వద్ద ఇప్పటికైతే లేవనే చెప్పాలి. దాడి జరిగాక ఆ ఉగ్రవాది ఎవరో, అతడికి ఎవరెవరితో సంబంధా లున్నాయో ఆరా తీసి నిర్బంధించడం సాధారణమే. సంస్థకు నిర్వాహకులు, వారు చెప్పినట్టల్లా నడుచుకునే కార్యకర్తలు ఉంటే... వారి మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే నెట్‌వర్క్‌ నడుస్తుంటే ఏదో ఒకచోట అది లీక్‌ అవుతుంది. ముందస్తు సమాచారం అందుతుంది. కానీ ఇంతకు ముందుగానీ, ఇప్పుడుగానీ దుండగుల కార్యకలాపాల గురించి అలాంటి సమాచారం లేదు. వారు అంతటి దారుణానికి పాల్పడగలరన్న అనుమానం కుటుంబసభ్యులకు లేదా ఇరుగు పొరుగుకు ఎప్పుడూ రాలేదు. ఐఎస్‌ సంస్థ తీరుతెన్నులే ఇలా ఉంటున్నాయి. వారికి సామాజిక మాధ్యమాలు తప్ప వేరే వాహికలు లేవు. ఆదేశాలివ్వడం, అమలు చేయడమన్న విధానాలే ఉండవు.

వారు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు, ప్రకటనలు చూసి వాటి స్ఫూర్తితో ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడు తున్న సందర్భాలే అధికం. ఇందువల్ల ఐఎస్‌కు రెండు రకాల ప్రయోజనాలు ఏకకాలంలో నెరవేరుతున్నాయి. తాము ఖండాంతరాల్లో ఉండి సంపన్న దేశాల్లోని ప్రధాన నగరాలల్లో దారుణానికి పాల్పడి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, తమను అణచడం సాధ్యం కాదన్న సందేశాన్ని పంపడం ఇందులో ఒకటైతే... దాడి జరిగిన దేశంలో ఉండే ముస్లిం మతస్తులపై అక్కడి పాలకులూ, పోలీసులూ, సమాజమూ అనుమాన దృక్కులు సారించేలా చేయడం రెండోది. ఇది ఎంత ఎక్కువగా సాగితే అంత ఎక్కువగా ఆయా దేశాల్లోని ముస్లింలు న్యూనతకు లోనవుతారు... వివక్షకు గురవుతారు... చివరకు తమ వైపు చూస్తారు అన్నదే ఉగ్రవాదుల ఎత్తుగడ.

ఆయా దేశాల పాలకులు ఉగ్రవాదుల ఎత్తుగడలను బలపర్చే తరçహాలో వ్యవహరి స్తున్నారు. ఈ సందర్భంగా రెండేళ్లక్రితం అమెరికా, బ్రిటన్‌లలో జరిగిన ఘటనలు గుర్తు తెచ్చు కోవాలి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు సొంతంగా తయారుచేసిన గడియారాన్ని టీచర్లకు చూపించి వారి మెప్పు పొందు దామని తీసుకెళ్తే ఆ టీచర్లు దాన్ని బాంబును చూసినట్టు చూశారు. నిలువెల్లా వణికి, పోలీసులకు పట్టించి ఇచ్చారు. వారొచ్చి ఆ భయాలను పోగొట్ట డానికి బదులు అతని చేతులు వెనక్కి విరిచి కట్టి జువెనైల్‌ హోంకు తీసుకెళ్లి అయిదు గంటలపాటు ప్రశ్నించారు. బాంబు తయారు చేయడం కోసం ముందుగా ఆ గడియారాన్ని రూపొందించావంటూ దబాయించారు.

బ్రిటన్‌లోనూ ఇంతే. పర్యా వరణంపై తరగతి గదిలో పాఠం చెబుతున్న టీచర్‌ నుంచి వివరణ కోరుతూ ఒక విద్యార్థి ‘ఇకో టెర్రరిస్టు’(పర్యావరణ ఉగ్రవాది) అనే పదం వాడాడు. అంతే...ఆ టీచర్‌ పోలీసులకు సమాచారం అందించడం, వారు అతడిని ఓ గదిలో బంధించి ఆ పదం నీకెలా తెల్సు... ఎక్కడ విన్నావు... ఐఎస్‌ గురించి నీకు తెలుసా అంటూ ప్రశ్నించడం వంటివి జరిగిపోయాయి. చిన్న వయసులోనే పర్యావరణ స్పృహ ఉన్నందుకు అతడిని ప్రశంసించకపోగా శంకించారు. గత నెలలో కేవలం ముస్లిం అన్న అనుమానంతో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను ఒక శ్వేత జాతీయుడు పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని చోట్ల ఇలాంటి దాడులే జరిగాయి.

సమాజంలో అన్ని వర్గాల సహకారాన్నీ తీసుకుని ఉగ్రవాదాన్ని తుద ముట్టించడానికి అవసరమైన చైతన్యాన్ని కలిగించాల్సిన పాశ్చాత్య ప్రభుత్వాలు నీడను చూసి భయపడే స్థాయికి పౌరులను దిగజారుస్తున్నాయి. దాడి జరిగాక దుండగుడు ఆసియా పౌరుడు అయి ఉండొచ్చని పోలీసులు ప్రకటించారు. దర్యా ప్తులో అతను లండన్‌కు పొరుగునున్న కెంట్‌ నివాసి అని తేలింది. అంతక్రితం ఇతర కేసుల్లో అరెస్టయి శిక్షలు పడటమే కాక... బ్రిటన్‌ పోలీసు విభాగం ఎంఐ5 నిఘాలో కూడా అతనున్నాడని పోలీసులు చెబుతున్నారు. లండన్‌ వంటి మహా నగరాల్లో అందరిపైనా నిఘా ఉంచడం కష్టమే. కానీ చిన్న చిన్న జాగ్రత్తలతో ఇలాంటి ఘోరాలను నివారించడం అసాధ్యమేమీ కాదు.

దాదాపు పదిహేనేళ్లుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నా వాటితో వ్యవహరించడంలో ప్రతిసారీ తప్పటడుగులు పడుతున్నాయి. ఏదైనా దాడి జరిగిన వెంటనే పౌరుల్లో మరింతగా ఆందోళన పెంచే తరహా ప్రకటనలు పాలకుల నుంచి వెలువడుతున్నాయి. సమాజంలో అందరూ ఒక్కటై ఎదుర్కొన వలసిన ఉగ్రవాదం విషయంలో మరింత అప్రమత్తత, మూలా లను గుర్తించి తుదముట్టించే తరహాలో చర్యలుండటం అవసరమని లండన్‌ దాడి వెల్లడిస్తోంది.

మరిన్ని వార్తలు