అన్నా..క్యాంటీన్‌ ఎక్కడ..?

6 Feb, 2018 13:00 IST|Sakshi
అన్న క్యాంటీన్‌ నమూనా

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సంగతేంటి..?

క్యాంటీన్ల ఏర్పాటును పక్కన పెట్టిన ప్రభుత్వం

తప్పించుకునేందుకు లక్ష జనాభా నిబంధన

పార్వతీపురం:2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ సర్కార్‌ ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. రుణమాఫీ, బాబు వస్తే జాబు, డ్వాక్రా, రైతు రుణమాఫీ, ఎన్టీఆర్‌ జలసిరి, నిరుద్యోగ భృతితో హామీలతో పాటు జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు కూడా ఒకటి. రూ.5కే భోజనం అందించి పేదోడి ఆకలి తీరుస్తామని అప్పట్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక మరో ఏడాదిలో దిగిపోతున్నా ఇప్పటివరకు క్యాంటీన్ల ఏర్పాటు విషయాన్ని గాలికొదిలేశారు. దీనిపై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హడావుడి చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు.

ఏర్పాటు ఇలా..
అన్న క్యాంటీన్ల ఏర్పాటును ఒక ప్రయివేటు సంస్థకు అప్పగిస్తారు. వారు నిర్దేశించిన స్థలంలో రేకుల షెడ్డు లు ఏర్పాటు చేసి వెళ్లిపోతారు. నిర్వహణను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తారు. ఇది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పండలేదు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఐదు, పురపాలక సంఘాల్లో రెండేసి, మండల     కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కాని విజయనగరం జిల్లాలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు.

నిబంధనల మార్పు..
అన్న క్యాంటీన్ల ఏర్పాటులో అధికారులు విఫలం కావడంలో ప్రభుత్వం కొత్త నిబంధనలను ఏర్పాటు చేసింది. స్థల, ఆర్థిక పరమైన ఇబ్బందులు చూపి చిన్న మెలిక పెట్టి ప్రభుత్వ తప్పించుకుంది. లక్ష పైబడి జనాభా ఉన్న చోట్ల మాత్రమే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు అర్హత కోల్పోయాయి. కేవలం జిల్లా కేంద్రానికి మాత్రమే ఆ అర్హత ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేయలేదు.

ఏర్పాటుకు కావాల్సినవి..
అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలంటే 1000 చదరపు అడుగుల ప్రభుత్వ లేక ప్రయివేటు స్థలాన్ని గుర్తించాలి. అనంతరం క్యాంటీన్ల నిర్మాణ బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్‌కు అప్పగించాలి. ఆయన వచ్చి 15 రోజుల్లో రేకుల షెడ్ల నిర్మాణం చేయాలి. తర్వాత వాటిని మహిళా సంఘాల సభ్యులకు అందిస్తారు. ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించి క్యాంటీన్ల నిర్వహణ జరిగేలా చేయాలి. ఎక్కడా ఈ పనులు జరగలేదు. జిల్లా కేంద్రం విజయనగరం, పార్వతీపురం మున్సిపాలిటీలో క్యాంటీన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన  చేసి ఆగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారులు స్థలాలను వెదికి పెట్టడం తలనొప్పిగా మారింది. విజయనగరం మున్సిపాలిటీలో ఆర్టీసీ కాం ప్లెక్సు, మున్సిపల్‌ కార్యాలయం, దాసన్న రైతు బజారు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో అక్టోబర్‌లో స్థల పరిశీలన చేశారు.        కానీ ఇప్పటివరకు కార్యరూపం      దాల్చలేదు.

రద్దీ ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తే మంచిది..
రద్దీ ఎక్కువగా ఉండే బస్, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ లక్ష జనాభా నెపంతో ప్రభుత్వం తప్పించుకుంది. 
      – అలజంగి జోగారావు, వైఎస్సార్‌ సీపీ అదనపు సమన్వయకర్త, పార్వతీపురం.

మరిన్ని వార్తలు