కౌమార బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ | Sakshi
Sakshi News home page

కౌమార బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Published Thu, Nov 23 2023 2:20 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి 
 - Sakshi

విజయనగరం అర్బన్‌: కౌమార బాలికల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేసి రక్తహీనతతో బాధపడేవారికి మందులు అందజేయాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. జనగన్న ఆరోగ్య సురక్ష రిఫరల్‌ కేసులు, గర్భిణులు, కౌమార బాలికల్లో రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం సమీక్షించారు. ఈ నెలాఖరులోగా జగనన్న ఆరోగ్య సురక్ష రిఫరల్‌ కేసులన్నింటికీ వైద్యం అందించాలని ఆదేశించారు. కొన్ని పీహెచ్‌సీల పరిధిలో కనీసం 20 శాతం కేసులకు వైద్యం అందించకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో మొత్తం 2,439 రిఫరల్‌ కేసులు నమోదుకాగా, ఇప్పటి వరకు 569 మంది మాత్రమే వైద్యసేవలు పొందారన్నారు. మిగిలిన వారికి వైద్యసేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. వారిని సీహెచ్‌సీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. జేఏఎస్‌ రిఫరల్‌ కేసులకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, బాలికలకు ఇస్తున్న ఐరన్‌ మాత్రలను వినియోగించేలా చూసే బాధ్యత ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలపై ఉందన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల, జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.ఎ.రమణి పాల్గొన్నారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి

Advertisement
Advertisement