ఏదీ..స్మార్ట్‌ సిటీల జాడ..?

15 Mar, 2019 10:37 IST|Sakshi
మౌలిక సుదపాయాల కల్పన ఇలా

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: స్మార్ట్‌ సిటీ..మంత్రం నిద్రావస్థలో మగ్గుతోంది. తాము అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను స్మార్ట్‌ సిటీలుగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకుంటామన్న ప్రస్తుత ప్రభుత్వ మాటలు నీటి మీద రాతలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా  ప్రకటించిన ఈ కార్యక్రమం జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు పట్టణ ప్రాం తాల్లోని ఒక్క వార్డులో అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది.

కేవలం ఆర్భాటాల కోసం పాలన ప్రారంభంలో మున్సిపల్‌ పాలకవర్గాలు స్మార్ట్‌ పేరు చెప్పుకుంటూ నిర్వహించిన కార్యక్రమాలు అంత బూటకమని తేలిపోయింది. ఈ విషయంపై ప్రచారానికి పోయిన ప్రభుత్వం, అధికార యం త్రాంగం ప్రస్తుతం ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా నిమ్మకుండడంపై సర్వత్రా విమర్శలు వక్తం అవుతున్నాయి. స్మార్ట్‌ సిటీల అమలు మాట దేవుడెరుగు కానీ ప్రజలకు కనీస వసతులు దక్కక నానా పాట్లు పడుతున్నారు.
 
ప్రయోజనం శూన్యం..
రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన చిన్నపాటి పట్టణాలు నుంచి పెద్ద నగరాలను సైతం స్మార్ట్‌ సిటీగా తయారు చేయాలన్న భావనతో 2014లో స్మార్ట్‌వార్డుల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ముందుగా ఆయా ప్రాంతాలు, పట్టణాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు దత్తత విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ఒక్క శ్రీమంతుడు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో మొత్తం వార్డుల్లో 20 శాతాన్ని 2016 మార్చి నెలాఖరులోగా స్మార్ట్‌గా తీర్చిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా దశల వారీగా స్మార్ట్‌ వార్డులను తీర్చిదిద్దూతూ పట్టణ ప్రాంతాలను స్మార్ట్‌ సిటీలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, యంత్రాంగం గొప్పలు చెప్పుకున్నారు. దీనిలో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వైస్‌ చైర్మన్‌ కనకల మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డుతో పాటు 3, 5, 13, 15, 22, 24, 32లను ఎంపిక చేశారు. అంతేకాకుండా బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో వార్డులను ఎంపిక చేస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వార్డు ప్రజలకు సమస్యల కష్టాల తీరి నట్లేనన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఐదు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏ ఒక్క వార్డులో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. పలు వార్డుల్లో గతంలో కన్నా పరిస్థితులు మరింత దయనీ యంగా మారిందన్న వివర్శలు వినిపిస్తున్నాయి.   

తొలి విడతలో ఎంపికైన వార్డులిలే..

ప్రాంతం  మొత్తం  వార్డులు  స్మార్ట్‌వార్డులుగా   మార్చాల్సిన  సంఖ్య
విజయనగరం కార్పొరేషన్‌    40   8
బొబ్బిలి మున్సిపాలిటీ 30 6
పార్వతీపురం మున్సిపాలిటీ   30 6
సాలూరు మున్సిపాలిటీ 29 6
నెల్లిమర్ల నగరపంచాయతీ  20 4

స్మార్ట్‌ వార్డుగా మారాలంటే...
ప్రభుత్వం నిర్దేశకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వార్డులు స్మార్ట్‌గా రూపుదిద్దుకోవాలంటే ప్రధానంగా ఐదు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

  • వార్డు పరిధిలోని గృహాలన్నింటికీ శతశాతం మంచి నీటి కుళాయి కనెక్షన్లు కల్పించాలి. అంతేకాకుండా నిరంతరం వాటి ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. 
  • శతశాతం వార్డులోని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. 
  • పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా నిర్వహించడంతో పాటు సేకరించిన చెత్తను కుప్పలుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించాలి. తడి పొడిచెత్తలను వేరు చేయాలి. 
  • స్మార్ట్‌ వార్డులుగా తీర్చిదిద్దాల్సిన వార్డుల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. వార్డు పరిధిలో ప్రధాన జంక్షన్లు ఉంటే అక్కడ మొక్కలు నాటాల్సి ఉంటుంది. 
  • నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించాలి. 
  • వీటితో పాటు జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో అమలు చేయాల్సిన 20 అంశాల్లో ప్రగతి సాధించాలి.  
మరిన్ని వార్తలు