గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం

21 Jan, 2018 07:11 IST|Sakshi

జుమ్మా మసీదు ముందు భాగం ఆకారంలో వేదిక

మూడు వేల మంది వీక్షించే విధంగా వేదిక ప్రాంగణం

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: గండికోట వారసత్వ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 21వతేదీ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. గత మూడు రోజులుగా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేత అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించడంతోపాటు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు.  గండికోట ఉత్సవాలలో జరిగే కార్యక్రమాలను సుమారు మూడు వేల మంది వీక్షించేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. వేదికను జుమ్మా మసీదు ముందు భాగం ఆకారంలో తీర్చి దిద్దారు. రాష్ట్రం నలుమూలలా తయారైన వివిధ రకాల వస్తువుల ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్‌ స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌తో పాటు, పుస్తకాల ప్రదర్శన, ఫుడ్‌స్టాల్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. రహదారి వెంబడి అలంకరణ పనులు పూర్తి చేశారు.  

నేడు పట్టణంలో ర్యాలీ..
గండికోట ఉత్సవాల సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం ఉదయం  ఆర్డీఓ వి.నాగన్న ఆధ్వర్యంలోకళాకారులు, స్థానిక అధికారులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం గండికోటలో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
గండికోట ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసినట్లు కడప డిప్యూటీ చీఫ్‌ మేనేజర్‌ కిశోర్‌కుమార్‌ పేర్కొన్నారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు నుంచి గండికోటకు ఒక్కొక్కరికి రూ.13 చొప్పున టిక్కెట్‌ ధర నిర్ణయించామన్నారు. రానుపోను టిక్కెట్‌ కూడ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి 2, మిగతా ఆరు డిపోల నుంచి ఒక్కొక్క బస్సును గండికోటకు నడుపుతామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు