పడిపోయిన భూగర్భజల మట్టం... అప్రమత్తత లేకుంటే ముప్పే

21 Jun, 2023 00:56 IST|Sakshi

 

 

కైలాస్‌నగర్‌: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలో 9.93 మీటర్ల లోతుకు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, యాసంగి సాగుకు ఎక్కువ నీటిని వినియోగించడం, బోరుబావుల తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం, జూన్‌ నెలాఖరుకు చేరినా వర్షాలు కురవకపోవడంతో జలమట్టం పాతాళానికి చేరువవుతోంది. నీటి వినియోగంపై అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకం 
జిల్లాలో బోరుబావుల తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కొందరు వాల్టా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు. నిబంధనల ప్రకారం బోరుబావి ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే బోరుకు బోరుకు మధ్య 250 మీటర్ల దూరం ఉండాల్సి ఉండాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం పది మీటర్ల దూరంలోనే రెండు, మూడేసి బోర్లు ఉండడం గమనార్హం. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం శ్రీమామూలుశ్రీగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తుండటంతో వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాగు చేసిన పంటలకు బోరుబావులే ఆధారం కావడంతో జలాల వినియోగం అధికమై లోతుకు చేరడానికి ప్రధాన కారణమవుతుంది.

ఇచ్చోడలో అట్టడుగుకు..
ఈ ఏడాది మే నెలలో నమోదైన అధికారిక నీటి మట్టం వివరాలు పరిశీలిస్తే.. ఇచ్చోడలో అత్యధికంగా 25.70 మీటర్లకు పడిపోయింది. అలాగే గుడిహత్నూర్‌లో 18.2 మీటర్లు, జైనథ్‌లో 14.85 మీటర్లు, నేరడిగొండలో 9.90 మీటర్ల లోతుకు చేరాయి. ఈ మండలాల్లో ఏప్రిల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇచ్చోడలో ఏకంగా 37.60 మీటర్లకు చేరడం గమనార్హం. అయితే మేలో కురిసిన అకాల వర్షాలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఏడు మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి.

అప్రమత్తత అవసరం
నీటి వినియోగంలో ప్రజలు అప్రమత్తత పాటించకుంటే ముప్పు తప్పదని అధికారులు సూచిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించేలా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ క్షేత్రాల్లోనైతే నీటి కుంటలు నిర్మించుకోవాలి. చెక్‌ డ్యాంల నిర్మాణం ద్వారా కూడా నీటిని సంరక్షించుకున్న వారమవుతాము. ఎక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను కాకుండా డ్రిప్‌, తుంపర్ల సేద్యం ద్వారా సాగయ్యే పంటలపై దృష్టిసారిస్తే నీటి సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

నీటిని పొదుపుగా వాడుకోవాలి
జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోరుబావుల తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలి. ముందుగా మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించి అనుమతించాకే బోరు ఏర్పాటు చేసుకోవాలి.
– ఏ.శ్రీవల్లి, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ

మరిన్ని వార్తలు