ఇన్విజిలేషన్‌ డబ్బుల చెల్లింపులో జాప్యం | Sakshi
Sakshi News home page

ఇన్విజిలేషన్‌ డబ్బుల చెల్లింపులో జాప్యం

Published Sat, Nov 11 2023 1:04 AM

-

● ‘సర్వే’ రెమ్యునరేషన్‌ కోసం తప్పని నిరీక్షణ

ఆదిలాబాద్‌టౌన్‌: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది విద్యా శాఖాధికారుల తీరు. ఈ నెల 3న జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్టేట్‌ ఎడ్యూకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డైట్‌ కళాశాలల విద్యార్థులు, మోడల్‌ స్కూల్‌ ఇంటర్‌ విద్యార్థులకు ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వం 60 శాతం నిధులు విడుదల చేసింది. డీఈవో అకౌంట్‌లో డబ్బులను సమగ్ర శిక్ష ద్వారా జమ చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత విధులు చేపట్టిన వారికి రెమ్యునరేషన్‌ చెల్లించాల్సి ఉంది. అయితే పరీక్ష ముగిసి వా రం దాటినా ఇప్పటికీ డబ్బులు రాలేదని వారు పే ర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లో ఈ డబ్బులను ఇప్పటికే చెల్లించగా, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ఒక్కో విద్యార్థికి విధులు నిర్వహించినందుకు రూ.500, టీ, స్నాక్స్‌ కోసం రూ.200 కేటాయించింది. జిల్లాకు మొత్తం రూ.10లక్షల 23వేల 166లను కేటాయించగా, 60 శాతం నిధులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన విద్యార్థులకు రూ.4లక్షల 66వేల 400 చెల్లించాల్సి ఉంది. సొంత ఖర్చుతో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో వీరికి విధులు కేటాయించగా, బాధ్యతాయుతంగా పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలు చూపి డబ్బులు చెల్లించడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయమై డీఈవో ప్రణీతను ఫోన్‌ ద్వారా వివరణ కోరేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement