వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ సమీక్ష!

28 Jul, 2023 02:14 IST|Sakshi

ఆదిలాబాద్‌: నిర్మల్‌ జిల్లాలో ఉధృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిళసై సౌందర్‌రాజన్‌ జిల్లాలో వరదల పరిస్థితిని సమీక్షించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రతినిధి యాటకారి సాయన్న జిల్లా పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసై జిల్లా ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడెం మండలం పాండవాపూర్‌ తాండ నుంచి 50 ఇళుల్ల ఖాళీ చేసి సమీపంలోని తాత్కాలిక గృహాల్లో, నవాబ్‌పేట గ్రామపంచాయతీలో 100 నివాసగృహాలు ఖాళీ చేసి 350 మందిని సమీపంలోని రైతువేదికలో ఉంచారని వివరించారు.

అంబర్‌పేటలో 50 గృహాలను ఖాళీ చేసి 200 మందిని నారాయణరెడ్డి షెడ్‌లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఖానాపూర్‌లో 70 గృహాలను ఖాళీ చేయించి 150 మందిని సమీపంలోని ఎల్‌ఎంఆర్‌ డిగ్రీ కాలేజీలో ఉంచారు. దస్తురాబాద్‌ మండలం దేవునిగూడా గ్రామంలో 15 ఇళ్లు ఖాళీ చేసి 60 మందికి దేవుని గూడా గ్రామపంచాయతీలో, భుక్తాపూర్‌ గ్రామాలో 11 ఇండ్లు ఖాళీ చేసి 45 మందికి బుక్తాపూర్‌ పాఠశాలలో, మున్యాల్‌ గ్రామం 30 ఇళ్లు ఖాళీ చేసి 156 మందికి మున్యాల్‌ స్కూల్లో, గొడిసెర్యాల్‌ గ్రామంలో 12 ఇళ్లకు చెందిన 55 మందికి, గుడిసెల స్కూల్లో పునరావాసం ఏర్పాటు చేశారని వివరించారు.

నిర్మల్‌ కేంద్రంలో జీఎన్‌ఆర్‌ కాలనీలోని 60 ఇళ్లను ఖాళీ చేయించి, 300 మందికి అల్‌ఫోర్స్‌ స్కూల్లో, సోఫి నగర్‌లోని పది ఇళ్లకు చెందిన 32 మందిని కమ్యూనిటీ హాల్‌లోని వసతికి తరలించారని తెలిపారు. భైంసా మండలం గుండెగాం లో 50 ఇళ్లకు చెందిన 200 మందిని భైంసాలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు