నాన్న కలను నిజం చేస్తూ..

29 Aug, 2023 12:58 IST|Sakshi

అచ్యుతాపురం (అనకాపల్లి): తాను బాక్సర్‌గా ఎదగాలనుకున్నాడు.. కాలం కలిసిరాక లారీ డ్రైవర్‌గా మిగిలాడు. అయితేనేం తన ఆశయాన్ని సజీవంగా ఉంచుకున్నాడు. కొడుకు ద్వారా తన కలను నెరవేర్చుకుంటున్నాడు. విశాఖకు చెందిన కాకి వెంకట సత్యనారాయణ బాక్సర్‌ అవ్వాలని భావించారు. రెండుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నారు కూడా. కానీ కాలం కలిసి రాలేదు. బతుకు తెరువు కోసం లారీ డ్రైవర్‌గా మారిపోయిన సత్యనారాయణ యలమంచిలి మండలం పురుషోత్తపురానికి వలస వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక సిమెంట్‌ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. తన కుమారుడు, కుమార్తెలకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించారు.

కుమార్తె మధ్యలోనే విరమించగా 9 ఏళ్ల ప్రాయం నుంచి బాక్సింగ్‌లో శిక్షణ పొందిన కుమారుడు భవానీ ప్రసాద్‌ పతకాలు సాధిస్తూ.. తండ్రి కలను నిజం చేస్తున్నాడు. బాక్సింగ్‌ శిక్షణ అంటే ఆషామాషీ కాదు. కఠినంగా ఉండడమే కాదు శారీరక దారుఢ్యం నిలుపుకునేందుకు ఫీడింగ్‌కే బోలెడంత ఖర్చవుతుంది. కొడుకును తీర్చిదిద్దడానికి సత్యనారాయణ లక్షల్లో అప్పు చేశారు.

తండ్రి తపనను అర్ధం చేసుకున్న భవానీ ప్రసాద్‌ బాక్సింగ్‌ రింగ్‌లో దూసుకుపోవడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్న ఈ బాక్సర్‌ ఇటీవల దుబాయ్‌లో ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. తాజాగా చెన్నయ్‌కి సమీపంలోని కడలూరులో నిర్వహించిన జాతీయ స్థాయి బాక్సింగ్‌లో ఇండియన్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ ర్యాంక్‌ను సాధించిన ప్రసాద్‌ ప్రస్తుతం విశాఖలోని నేషనల్‌ బాక్సర్‌ అమోర్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో టాప్‌ 50లో స్థానం సంపాదించాలన్నది తన లక్ష్యమని, దీని కోసం ఎంత కష్టమైనా పడతానని సత్యానారాయణ సాక్షికి తెలిపారు.

మరిన్ని వార్తలు