పశు సంవర్ధకానికి రూ.12,606 కోట్ల రుణం

19 Apr, 2021 03:13 IST|Sakshi

2021–22 రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు వెల్లడి

ఇందులో పాడి అభివృద్ధికే రూ.8,232.33 కోట్ల రుణం

మహిళలకు పెద్ద ఎత్తున పశు సంపద అందిస్తున్న రాష్ట్ర సర్కార్‌కు మద్దతివ్వనున్నట్లు ప్రకటన  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సహకార డెయిరీలను ప్రోత్సహించేందుకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన తోడ్పాటునందిస్తామని నాబార్డు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణ ఆవశ్యకత ఉన్నట్లు నాబార్డు అంచనా వేసింది. 2021–22లో మొత్తంగా పశు సంవర్ధక రంగానికి రూ.12,606 కోట్ల మేర రుణ ఆవశ్యతక ఉంటుందని రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 15.87 శాతం ఎక్కువని తెలిపింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌.. మొత్తం దేశంలోనే 4వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2019–20లో 152.63 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. దీని విలువ రూ.57,433 కోట్లుగా పేర్కొంది. ఏపీలో రోజూ 380 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. ఇందులో 46 శాతం రాష్ట్ర సొంత అవసరాల కోసం.. మరో 34 శాతం అసంఘటిత రంగాలు వినియోగిస్తుండగా, 18 నుంచి 20 శాతం సహకార, ప్రైవేట్‌ పాల ఉత్పత్తుల రంగాలకు వెళ్తున్నాయని నాబార్డు పేర్కొంది. 

డెయిరీ అభివృద్ధిపై దృష్టి..
పాడి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఈ నేపథ్యంలో తాము కూడా డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నాబార్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించిన ఆర్థిక సాయానికి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించి పశు సంపదను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మహిళా పాడి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు వారి నుంచి ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసేలా.. అమూల్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో అమూల్‌ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పాల సేకరణ చేస్తోంది. అలాగే మహిళా డెయిరీ సహకార సంఘాలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాబార్డు కూడా ఈ ఆర్థిక సంవత్సరం పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణాల ఆవశ్యకత ఉన్నట్లు అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు