మధురవాడే హాట్‌ కేక్‌.. పోటీపడుతున్న అనకాపల్లి..  

6 May, 2022 15:33 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేనే నంబర్‌ అంటోంది మధురవాడ. రియల్‌ రంగంలో ఇప్పుడు ఈ ప్రాంతమే కేంద్ర బిందువు. నగరంలో జరుగుతున్న నిర్మాణాలు మాత్రమే కాదు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా వచ్చిన ఆదాయాన్ని గమనించినా ఇదే విషయం స్పష్టమవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది 1207.45 కోట్ల ఆదాయం రాగా.. కేవలం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఏకంగా 243.06 కోట్ల ఆదాయం వచ్చింది.

అంతేకాకుండా 10,096 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఆ తర్వాతి స్థానంలో విశాఖ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నిలిచింది. ప్రధానంగా చినగదిలి, మద్దిలపాలెం, రుషికొండ, కలెక్టరేట్‌ వంటి మంచి మార్కెట్‌ ధర ఉన్న ప్రాంతాలు.. ఈ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో ఉండటంతో గతేడాది రూ. 203.63 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు అనకాపల్లి పరిధిలో కూడా రిజిస్ట్రేషన్‌ జరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్య అధికంగా ఉంది. యలమంచిలి ప్రాంతం కూడా డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లల్లో మూడు ప్రాంతాలతో పోటీ పడుతోంది.

పోటీపడుతున్న అనకాపల్లి  
రిజిస్ట్రేషన్ల ఆదాయపరంగా చూస్తే మధురవాడ, విశాఖపట్నం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పోటీ పడుతున్నాయి. మధువాడ కార్యాలయం నుంచి రూ.243.06 కోట్ల ఆదాయం రాగా.. విశాఖపట్నం కార్యాలయం నుంచి రూ.203.63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రధానంగా కలెక్టరేట్‌తో పాటు బీచ్‌రోడ్, రుషికొండ, చినగదిలి ప్రాంతాల్లో మార్కెట్‌ ధర అధికంగా ఉండటంతో పాటు రుషికొండ వరకు నూతన నిర్మాణాల వల్ల విశాఖపట్నం రిజిస్ట్రేషన్‌ కార్యాలయ ఆదాయం బాగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల సంఖ్య కూడా అన్ని ప్రాంతాల కంటే ఎక్కువే. ఇక మధురవాడ నిర్మాణ రంగానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఈ ప్రాంతం నుంచి బాగా ఆదాయం సమకూరుతోంది. అయితే.. డాక్యుమెంట్ల పరంగా ఈ రెండు ప్రాంతాలతో అనకాపల్లి పోటీపడుతోంది.

మధురవాడలో గడిచిన ఏడాదిలో 10,096 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. విశాఖపట్నంలో అంతకంటే ఎక్కువగా 12,946 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోటీగా అనకాపల్లిలో ఏకంగా 12,228 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరగడం విశేషం. అంటే మధురవాడ కంటే ఎక్కువ డాక్యుమెంట్లు ఇక్కడ రిజి్రస్టేషన్‌ జరిగాయి. మరోవైపు యలమంచిలిలో కూడా ఈ మూడు ప్రాంతాలతో పోటీ పడుతూ 10,523 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు లేవు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అక్కడ కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఎక్కడెక్కడ ఎలా ఉందంటే...! 
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్‌(విశాఖపట్నం, అనకాపల్లి) కార్యాలయాలు, మొత్తం 19 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు(ఎస్‌ఆర్‌వో) ఉన్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏయే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎంత మేర ఆదాయం(కోట్లలో) వచ్చింది? ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయనే వివరాలను గమనిస్తే....

83 శాతం లక్ష్యం సాధించాం
2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1449.56 కోట్ల మేర ఆదాయం అర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 31 మార్చి 2022 నాటికి 1207.45 కోట్ల మేర ఆదాయం సమకూరింది. నిరీ్ణత లక్ష్యంలో 83.29 శాతం మేర సాధించాం. మధురవాడ, విశాఖపట్నం రిజి్రస్టేషన్‌ కార్యాలయాల పరిధిలో మాత్రం నిరీ్ణత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటాం.  
–ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ  

మరిన్ని వార్తలు