Crocodiles: ముచ్చటగా 32.. దత్తత తీసుకుంటారా..

5 Feb, 2022 17:33 IST|Sakshi
ఘరియల్‌ మొసళ్లు

ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూ పార్కులో ఎన్నెన్నో రకాల వన్యప్రాణులున్నాయి. ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, కనుజులు, జింకలు, వివిధ రకాల పక్షులతో పాటు వివిధ జాతుల పాములు జూకు వెళ్లే సందర్శకులకు నేరుగా ఎన్‌క్లోజర్లలో కనిపిస్తుంటాయి. అయితే జూలో మొసళ్లు  ఎక్కడా అని సందర్శకులు వెతుకుతుంటారు. అసలు జూలో మొసళ్లే లేవని ఇంకొందరు అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. జూలో మొసళ్లు కూడా ఉన్నాయి.. ఒకటి కాదు.. రెండు.. కాదు.. మూడు రకాలకు చెందిన 32 మకరాలున్నాయి. వాటి సంతతిని ఇప్పుడిప్పుడే వృద్ధి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులో మూడు ఉప్పు నీటి మొసళ్లు, ఆరు ఘరియల్స్, 23 మగ్గర్‌ మొసళ్లు(మూడు పెద్దవి, 20 పిల్లలు) ఉన్నాయి.

చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది..


కొలను ఒడ్డున పిల్లలతో మగ్గర్‌ మొసళ్లు  

జూ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి మొసళ్లకు అధికారులు ప్రత్యేక స్థానం కల్పించారు. మొదటి నుంచి మూడు రకాల మొసళ్లను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. వాటి కోసం పాముల జోన్‌ వెనుక భాగం, సాగర్‌ ద్వారం నుంచి కుడివైపులో రెండు కొలనులు, సాగర్‌ ద్వారంలో ఎడమ వైపు ప్రధాన రహదారి పక్కనే మరో కొలను ఏర్పాటు చేశారు. వీటిలో సాగర్‌ ద్వారం నుంచి కుడి వైపున ఉప్పునీటి మొసళ్లు(సాల్ట్‌ క్రోకోడైల్‌), మగ్గర్‌ మొసళ్ల కొలనులు ఉన్నాయి. సాగర్‌ ద్వారం నుంచి ఎడమ వైపు ఘరియల్‌ మొసళ్లు కొలను నిర్మించారు.

ఉప్పునీటి మొసలి  

ఈ మూడు కొలనుల్లో మొదట్లో ఒక్కో జత చొప్పున ఆయా రకాలకు చెందిన మొసళ్లు విడిచిపెట్టారు. అవి సందర్శకులను అలరించేవి. అవి రానురాను వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అయినా ఎప్పుడూ వాటి మూడు రకాల సంఖ్య 10 దా టేది కాదు. ఇప్పుడు మూడు పదులు దాటడం విశేషం. మగ్గర్‌ జాతి మొసళ్లు రెండు ఆడవి, ఒకటి మగది(పెద్దవి) ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆడ మొసలి గతేడాది మే 20న 20 పిల్లలను పొదిగింది. దీంతో వాటి సంఖ్య ఒక్క సారిగా 3 నుంచి 23కు చేరింది. ఆ 20 పిల్లలు ప్రస్తుతం జనక మొసళ్లతో వాటి కొలనులో హుషారుగా తిరుగుతున్నాయి.

తల్లి మొసలితో పాటు ఒడ్డుకు చేరి గట్టుమీద గడుపుతున్నాయి. ఇక్కడ పొదగబడిన పిల్లలన్నీ బతకడం విశేషం. సాధారణంగా పొదగబడిన కొద్ది రోజులకు కొన్ని పిల్లలు నీటిలో తిరుగుతున్న సమయంలో పెద్ద మొసళ్లు ఢీకొనడం, ఒడ్డుకు చేరిన సమయంలో ఏవైనా పక్షులు ఎత్తుకుపోవడంతో ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ ఇవి పొదగబడి సుమారు తొమ్మిది నెలులు గడిచింది. ప్రస్తుతం ఇవి సుమారు 5 నుంచి 8 కిలోల బరువు పెరిగాయి. దీంతో వీటిని పక్షులు ఎత్తుకెళ్లలేవు. సరికదా కొలను లోపల పెద్ద మొసళ్లు ఢీకొన్నప్పుటికీ తట్టుకొనే శక్తి వచ్చిందని యానిమల్‌ కీపర్లు, జూ అధికారులు అంటున్నారు. పిల్లలన్నీ బతకం అరుదైన విషయంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఘరియల్స్‌
ఇక్కడ సాగర్‌ ద్వారం దాటగానే ఎడమ వైపు రోడ్డు పక్కన ఘరియల్స్‌ కొలను ఉంది. జూ ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 6 ఘరియల్‌ జాతికి చెందిన మొసళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆడవే. ఇవి తరుచూ కొలను నీటి నుంచి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటికి సుమారు అర మీటరు పొడవున నోరు ఉంటుంది. ఆ నోటిని పైకి పెట్టి నీటిలో ఈదుతూ చేపలను పట్టుకుని తింటాయి. ఇవి ఒడ్డుకు చేరి ఎక్కువ సేపు గడుపుతూ సందర్శకులను అలరిస్తుంటాయి.

ఇదీ మొసళ్ల మెనూ.!
ఇక్కడ మొసళ్లకు రోజులో రెండుసార్లు ఆహారం అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చికెన్, బీఫ్‌ను బోన్స్‌(దుమ్ములు)తో కలిపి కైమా చేసి వేస్తుంటారు. వీటితోపాటు కొన్ని రోజుల్లో చేప పిల్లలను, పెద్ద చేప ముక్కలు కొలనుల్లో వేస్తున్నారు. ఇవిగాక కొలనులో వాటికి దొరికిన నత్తలు, కీటకాల లార్వా తింటాయి. ఇది లా ఉండగా ఇక్కడ వాటి సంఖ్య పెరుగుతున్న రీతిలోనే వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా భారీగా పెరిగిపోతుంది. అందుకే జూ అధికారులు దాతలు ముందుకొచ్చి వాటిని దత్తత తీసుకోవాలని కోరుతున్నారు. 

ఉప్పునీటి మొసళ్లు
ఇక్కడ ప్రస్తుతం ఉప్పు నీటి మొసళ్లు మూడున్నాయి. ఈ మూడూ ఆడవే. నాలుగేళ్ల కిందట ఇక్కడ ఒక జత ఉప్పునీటి మొసళ్లు ఉండేవి. వాటిలో ఆడ మొసలి గుడ్లు పెట్టి సుమారు 10 పిల్లలను పొదిగింది. ఆ పిల్లల్లో 8 మృతి చెందాయి. దీంతో పాటు ఇక్కడ మగ మొసలి కూడా వృద్ధాప్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ప్రస్తుతం మూడు ఆడ ఉప్పునీటి మొసళ్లు ఈ కొలనులో సందర్శకులను అలరిస్తున్నాయి.  

మొసళ్లను దత్తత తీసుకోండి 
జూలో మొసళ్ల సంఖ్య పెరిగింది. అవి సందర్శకులను అలరిస్తున్నాయి. వాటితో పాటు జూలో అన్ని జాతుల వన్యప్రాణులు సంఖ్య పెరిగింది. అందుకే దాతలు ముందుకు వచ్చి వాటిని దత్తత తీసుకుని ఆహారం అందించాలని కోరుతున్నాం. మొసళ్లను వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఒక్కో మొసలికి వారానికి రూ.525, నెలకు రూ.2,000, ఆరు నెలలకు రూ.12,000, ఏడాదికి రూ.24,000 ఆహారం కోసం ఇచ్చి దత్తత తీసుకోవచ్చు. ఉప్పు నీటి మొసలి, ఘరియల్స్‌లో ఇక్కడ మగవిలేవు. దీంతో ఆయా రకాల మొసళ్లను ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.  
– నందనీ సలారియా, జూ క్యూరేటర్‌ 

మరిన్ని వార్తలు