మున్సిపల్‌ నగారా.. ఆగిన చోట నుంచే

16 Feb, 2021 03:49 IST|Sakshi

మార్చి10న పోలింగ్‌ .. 14న ఓట్ల లెక్కింపు

గతేడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి కొనసాగింపు 

12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు 

గత మార్చిలోనే ముగిసిన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన 

నామినేషన్ల ఉపసంహరణతో మొదలుకానున్న ఎన్నికల ప్రక్రియ

నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. గత ఏడాది మార్చిలో.. మధ్యలో ఆగిపోయిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. వచ్చే మార్చి 10వ తేదీన పోలింగ్‌ నిర్వహించి, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయిన 12 నగర పాలక సంస్థలకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలో ఉండగా ఈ నోటిఫికేషన్‌ జారీ అయింది. 

ఇక్కడ ఎన్నికలకు బ్రేక్‌
గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడే నాటికి.. కోర్టు వివాదాలు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా అప్పుడే విలీనం కావడం తదితర కారణాలతో 16 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. పామిడి నగర పంచాయతీని డౌన్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడిన 12 చోట్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు తయారీ వంటి ప్రక్రియ చేపట్టనందున వాటిలోనూ ఎన్నికలు పక్కనపెట్టారు. 

ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు
రాజాం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట, పామిడి, భీమవరం, జగ్గయ్యపేట, ఆకివీడు, దర్శి, గురజాల, దాచేపల్లి, కొండపల్లి, పెనుకొండ, కమలాపురం, బేతంచర్ల, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం.

ఎన్నికలు జరిగేవి...
శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ 
విజయనగరం: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల 
విశాఖపట్నం: నర్సీపట్నం, యలమంచిలితూర్పుగోదావరి: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మడివరం
పశ్చిమ గోదావరి: నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం
కృష్ణా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు.
గుంటూరు: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల 
ప్రకాశం: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు
నెల్లూరు: వెంకటగిరి, అత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట
అనంతపురం: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర
కర్నూలు: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, అత్మకూరు
వైఎస్సార్‌: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల
చిత్తూరు: మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు

ఎన్నికలు జరగని కార్పొరేషన్లు
కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2017లోనే ఎన్నికలు నిర్వహించారు. ఇక కోర్టు వివాదాల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లలో ఎన్నికలు నిలిపివేశారు. 

ఎన్నికలు జరిగేవి
విజయనగరం, గ్రేటర్‌ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు.  

మరిన్ని వార్తలు