ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...

30 Nov, 2021 00:45 IST|Sakshi

మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడుగునా ఎదుర్కోవడానికి ఏపీలో ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనావ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు ప్రశంసించారు. నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్‌ చంద్రు గుర్తించారు. ఈ కోణంలోనే రాజధానుల బిల్లును తాత్కాలికంగా వెనక్కు తీసుకున్న సందర్భంలో కూడా, నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని సీఎం జగన్‌ స్పష్టపరిచారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఎందుకు తలపెట్టవలసి వచ్చిందో వివరిస్తూ మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు విలువైన, సమగ్రమైన విశ్లేషణను వెలిబుచ్చారు. పేరు ప్రతిష్ఠలున్న మరొక వర్తమాన న్యాయమూర్తి ఎవరూ ఇలాంటి విశ్లేషణను అందించలేకపోయారు. ఇటీవల వ్యవసాయ రంగంలో ‘సంస్కరణల’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాల్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేసినప్పుడు, ఆ శాసనసభల అధికారాల్నీ కొందరు ప్రశ్నించారు. కానీ శాసనసభల అధికారాన్ని ఇలా ప్రశ్నించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా విమర్శించాల్సి వచ్చింది. 

ప్రజాస్వామ్యంలో దేశ సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందని జస్టిస్‌ చంద్రు వివరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధాని అని హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తిరస్కరించడమే కాదు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానుల నిర్మాణ అవసరాన్ని కూడా గుర్తించవలసి వచ్చిందని జస్టిస్‌ చంద్రు భావించారు. అర్ధంతరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, విభజిత ప్రాంతాన్ని నట్టేట్లో వదిలిన ఫలితంగా 2020లో జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్‌ చంద్రు గుర్తించారు. దురదృష్ట కరమైన విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో మూడు రాజధానులపై జస్టిస్‌ చంద్రు చేసిన విలువైన వ్యాఖ్య పెద్దగా ఎవరి దృష్టిలోనూ పడలేదు.

జగన్‌ ప్రభుత్వాన్ని. దాని ప్రజాహిత నిర్ణయాలను మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడు గునా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనా వ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని జస్టిస్‌ చంద్రు ప్రశంసించాల్సి వచ్చింది. చివరికి తన వరుస ప్రజావ్యతిరేక చర్యల కారణంగా, రాష్ట్ర శాసనపరిషత్‌లో టీడీపీ సభ్యుల సంఖ్య కూడా క్రమంగా కుదేలయిపోయింది. అధికారపార్టీ సభ్యులు 11 మంది ఏకముఖంగా ఇటీవలే మండలికి ఎన్నిక కావడంతో నామమాత్రపు ప్రతిపక్షం సంఖ్య కూడా కనుమరుగయ్యే దుఃస్థితి టీడీపీకి ఎదురైంది! ఈ మింగలేని, కక్కలేని దుర్గతితో చిక్కు బడిపోయిన చంద్రబాబు వర్గం న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే దుష్ట పన్నాగంతో ఆఖరి తురుఫు ముక్క కూడా వాడేయడానికి సాహసించింది.

రాష్ట్రంలో ‘రాజ్యాంగ సంక్షోభం’ ఏర్పడిందన్న మిషపైన ఎలాగోలా ఏపీలో రాష్ట్రపతి పాలనను రుద్దించడానికి కూడా ప్రయత్నించింది. కానీ గతంలో బొమ్మై కేసులో (కర్ణాటక), సుప్రీంకోర్టులోని మెజా రిటీ సభ్యులతో కూడిన ధర్మాసనం ‘రాజ్యాంగ సంక్షోభం’ అన్న మిషపై కోర్టుకెక్కి రాష్ట్రపతి పాలనను రుద్దించాలని చూసిన  ప్రతిపక్షం పాత్రను తుత్తునియలు చేసింది. బొమ్మై ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చవలసింది శాసనసభే గానీ, కోర్టు కాదని సుప్రీం కోర్టు నాటి విచారణ సందర్భంగా ప్రతిపక్షానికి లెంపలు వాయించి మరీ పంపింది! అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులకు ప్రజలు విసిగిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నికరపరిచిన ప్రజాతీర్పు చంద్ర బాబుపై వ్యతిరేకతను కళ్ళకు కట్టి చూపింది. 

అందుకే జగన్‌ బాధ్యతగల ప్రజా ముఖ్యమంత్రిగా రాజధానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ రాజధాని మోడల్‌ నూతన ఆంధ్రప్రదేశ్‌కు వద్దనీ, అలాంటి చారిత్రక తప్పిదానికి మరోసారి పాల్పడరాదనీ ప్రజలు ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాబట్టే నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తేల్చుకుంది. అయితే కొందరు రియల్‌ ఎస్టేట్‌ కుబేరులు, అధికార వికేంద్రీకరణ పథకం మూలంగా తమ వ్యాపార లావాదేవీలకు నష్టం వాటిల్లుతుందని అప్పుడే గగ్గోలు పెట్టడం ప్రారంభమైంది. నిజానికి తాము చేసే ప్రచారం ఫలిస్తే, ఆ పేరిట మరిన్ని లాభాలను రియల్‌ ఎస్టేట్‌ ద్వారా పొందడం సాధ్యమని వారికీ తెలుసు.

భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్‌ అంబేడ్కర్‌ మొత్తం రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలన్నిటా ప్రజావసరాలను ఏకరువు పెడుతూ వచ్చారు. దేశంలో అట్టడుగున ఉన్న దళిత, గిరిజన, అణగారిన జాతుల, పేదసాదల, వ్యవసాయ కార్మికుల జీవితాలను ఉద్ధరించే వాదనలు, ప్రతిపాదనలే చేస్తూ వచ్చారు. చివరికి కేంద్రమంత్రివర్గంలో సభ్యుడై ఉండి కూడా పాలకవర్గ నిర్ణయాలు గాడితప్పి, రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ముందుకు సాగుతుండడం గమనించి, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ అంబేడ్కర్‌ ఒక బలమైన హెచ్చ రిక చేసి మరీ బయటపడ్డారు. ప్రజలు ధన, మాన, ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న స్వాతంత్య్రాన్ని, ‘ప్రజలమైన మేము’గా రూపొందించుకున్న సెక్యులర్‌ రాజ్యాంగ లక్ష్యాలకు పాలకులు ఆచరణలో విఘాతం తలపెట్టే పక్షంలో...‘పార్లమెంటు భవనాన్ని కూల్చడానికి సహితం ప్రజలు వెనుకాడరు సుమా’ అని అంబేడ్కర్‌ హెచ్చరించిన సంగతం మనం మరచిపోరాదు! 

ఇంతకూ ఇటీవల ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ గౌరవ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒకే రాష్ట్రంలో మూడు రాజధానులూ, మూడు న్యాయస్థానాలూ సాధ్యమా, అలా ఎక్కడైనా ఉన్నాయా, అన్న ప్రశ్న, అనుమానాలూ సహజంగా తలెత్తాయి. ఈ విషయం గతంలో కూడా ప్రస్తావనకు వచ్చినపుడు ఇదే పత్రిక (సాక్షి)లో ఈ వ్యాసకర్త వివిధ దేశాల్లో వివరాలను, మనదేశంలోని వాటి వివరాలను ప్రకటించారు. అమరావతి మొత్తం ఏకైక రాష్ట్ర రాజధాని కావడం వల్ల కర్నూలు, విశాఖపట్నం కేంద్రాలు ఒక్కొక్కటి అమరావతికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. అలా కాకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుంటే ఆయా రాజధానుల చుట్టూ ఉన్న నగరాలు, గ్రామాలలో అభివృద్ధి లోటుపాటుల్ని సరిదిద్దడానికి వీలుగా ఉంటాయి. 

ఈ దృష్ట్యానే ఉత్తరప్రదేశ్‌కు ప్రయాగ న్యాయరాజధాని గానూ, లక్నో పరిపాలనా రాజధానిగానూ ఉన్నాయి. మహారాష్ట్రకు ముంబై, నాగపూర్‌ రాజధానులు, కర్ణాటకు బెలగావి(బెల్గాం), బెంగళూరు రాజధానులుగా ఉంటున్నాయి. అలాగే మలేషియా రాజధానులు కౌలాలంపూర్, పుత్రజయ; జెకోస్లావేకియా రాజధానులు ప్రాగ్, బ్రనో; బొలీవియా రాజధానులు లాపాజ్, సుక్రీ; చిలీ రాజధానులు శాంటియాగో, వల్పరాజో; శ్రీలంక (కొలంబో, శ్రీ జయవర్ధనీ పుత్రకోటి), టాంజానియా (దార్‌ ఇ సలామ్, డొడోమా) నిక్షేపంగా పాలనను అందిస్తున్నాయి. కాగా, అసమానతల బెడద వల్లనే తమిళ నాడులో దక్షిణ తమిళనాడు విడిపోవాలని కోరుతున్న వ్యక్తి పి. చిదంబరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు స్వార్థ ప్రయోజ నాలకు బలిచేసిన వ్యక్తి కూడా ఈ చిదంబరమే! ఇది చరిత్ర, చెరపరాని చరిత్ర, వినదగిన చరిత్ర.


- ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు