Fact Check: కాకి లెక్కలతో రోత

10 Jan, 2024 05:17 IST|Sakshi

కోత పెట్టాలనుకుంటే వెతికి మరీ పరిహారం ఎందుకిస్తారు రామోజీ? 

ప్రాథమిక – తుది నష్టం అంచనాలకు తేడా ఉండదా? 

కరువు, మిచాంగ్‌ తుపాను సాయం పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు 

రైతులకు రూ.5,942 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు 

వాటిలో ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలే రూ.2,558 కోట్లు   

సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రాథమిక పంట నష్టం అంచనాలకు, తుది నష్టం లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అంచనాలను ముంపు విస్తీర్ణం ఆధారంగా అప్పటికప్పుడు రూపొందిస్తారు. ముంపునీరు సకాలంలో దిగిపోతే పంటలకు నష్టం వాటిల్లదు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులొస్తాయి. ఇది రైతన్నలందరికీ తెలిసినా రోత రాతల రామోజీ మాత్రం పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందంటూ బురద చల్లుతున్నారు.

నిజంగానే అలా తగ్గించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉంటే గతంతో పోలిస్తే పెట్టుబడి రాయితీని పెద్ద ఎత్తున ఎందుకు పెంచుతుంది? లబ్దిదారులను వెతికి మరీ ఎందుకిస్తుంది? గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను ఎందుకు చెల్లిస్తుంది? ఇక రామోజీ చెబుతున్నట్లు అన్నదాతకు వాతలు నిజమే కానీ, అది ఇప్పుడైతే కాదు. చంద్రబాబు సర్కారు హయాంలో అన్నది పచ్చి నిజం. అప్పుడు రామోజీ కలం మొద్దుబారిపోవడంతో కదల్లేదు కాబోలు!!   

ఎలా లెక్కిస్తారో తెలియదా? 
ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాల స్థాయి, జలాశయాల మట్టం) పరిగణలోకి తీసుకొని కరువు మండలాలను ప్రకటిస్తారు. తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు.

క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటల వారీగా లెక్కించిన నష్ట పరిహారాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందిస్తారు. ఆర్బీకే సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం అన్నదాతలకు తోడుగా నిలవడంతో ముంపు నీరు త్వరగా దిగిపోయేలా చేసి పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు.   

పెరిగిన పెట్టుబడి రాయితీ 
వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు గతంలో హెక్టారుకి రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8,500కి పెంచింది.

నీటిపారుదల భూములైతే ఇన్‌పుట్‌ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా ఇప్పుడు రూ.17 వేలు అందిస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500కి పరిహారం పెరిగింది. మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలకు పెంచి ఇస్తున్నారు.      

ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే 
చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువే తాండవించినా రైతులను కనికరించలేదు. హుద్‌హుద్‌ నుంచి పెతాయి తుపాన్‌ వరకు ఏటా విరుచుకుపడినా ఏనాడైనా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి నష్ట పరిహారాన్ని ఆ సీజన్‌ కాదు కదా కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. ఐదేళ్ల పాలనలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదే.

సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఒక్క అన్నదాతలకే చంద్రబాబు ఎగ్గొట్టారు. ఇక రైతులకే మరో రూ.8,845 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు పెట్టారు. వీటిని ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా నిలిచింది.

విపత్తు ఏదైనా ఆగమేఘాల మీద స్పందిస్తూ నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతుకు సీజన్‌ చివరిలో పంట నష్ట పరిహారాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.45 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించింది. పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది.  

నిబంధనలు సడలించి కొనుగోలు
వర్షాభావంతో 2023 ఖరీఫ్‌లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 103 కరువు మండలాలను గుర్తించగా 14.07 లక్షల ఎకరాల్లో 6.96 లక్షల మంది రైతులు పంట నష్ట పోయినట్లు తేలింది. వారికి రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయి­తీని ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు డిసెంబర్‌లో మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంట నష్టపోయిన 4.61­లక్షల మంది రైతులకు రూ.442.11 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా త్వరలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తుపాన్‌ ప్రభావంతో రంగు మారిన, తడిసిన 12.70 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని నిబంధనలు సడలించి మరీ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది.  

>
మరిన్ని వార్తలు