ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలు.. డాక్టర్‌ ‘ఏపీ’!..

19 Aug, 2023 04:29 IST|Sakshi
మచిలీపట్నం మెడికల్‌ కళాశాల

ఐదు కొత్త కాలేజీలతో అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో కొనసాగుతున్న మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ 

మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే కన్వీనర్‌ సీట్లన్నీ భర్తీ.. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభించేలా సన్నద్ధం 

రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వైద్య విద్య కోసం విదేశాలకు తగ్గనున్న విద్యార్థులు   

సాక్షి, అమరావతి: తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కోరుకుంటున్న వారి కలలు సాకారం కావడంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కావడంతో పేదలకు ఆరోగ్య భరోసా చేకూరుతోంది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీంతో ఏకంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రావడంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు భారీగా  పెరిగాయి.

ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023–24 ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లోనే కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల కేటాయింపు కూడా పూర్తి కానుంది.  

రిజర్వేషన్‌ వర్గాలకు భారీ మేలు 
కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం సీట్లు ఆల్‌ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటాకు కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ రంగంలోని 12, 18 మైనారిటీ, ప్రైవేట్‌ కళాశాలల్లో 3,360 కన్వీనర్‌ కోటా సీట్లు ఉండేవి. ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల ఏర్పాటుతో ఒక్కో చోట 64 చొప్పున 320 సీట్లు కన్వీనర్‌ కోటాలో అదనంగా వచ్చి చేరాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మెరిట్‌ విద్యార్థులకు భారీ మేలు చేకూరింది. 

వలసలకు తెర 
వైద్య విద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో కజకిస్తాన్, ఉక్రెయిన్, చైనా, రష్యా తదితర దేశాలకు మన విద్యార్థులు వలస వెళుతున్నారు. వీటిని అరికట్టడంతోపాటు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు సీఎం జగన్‌ రూ.8,480 కోట్ల వ్యయంతో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నారు.

ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, ఆ తర్వాత ఏడాది మిగిలిన ఏడు వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా ఏకంగా 2,550 సీట్లు అదనంగా పెరగనున్నాయి. వైద్య విద్య సీట్ల పెరుగుదలతో మన దగ్గర డాక్టర్‌ చదువులకు అవకాశాలు విస్తృతమై వలసలకు తెర పడనుంది.   

అన్ని వసతులతో 
తొలి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థుల అకడమిక్‌ కార్యకలాపాల కోసం కొత్త ఆస్పత్రుల్లో అన్ని వసతులను కల్పించారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రి, కళాశాలలను అభివృద్ధి చేశారు. ఐదు చోట్ల ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చింది.

కళాశాలల్లో హైఎండ్‌ ఏవీ సదుపాయంతో లెక్చర్‌ గ్యాలరీలు, 3 వేల పుస్తకాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మెడికల్‌ జర్నల్స్‌ సేకరణతో సెంట్రల్‌ లైబ్రరీ, రీడింగ్‌ ఏరియా, అత్యాధునిక పరికరాలతో ల్యా»ొరేటరీలు, టీచింగ్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. హ్యూమన్‌ అనాటమీ, క్లినికల్‌ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్‌ ల్యాబొరేటరీ, స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ ల్యాబ్‌లలో అన్ని వనరులు సమకూర్చారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు హాస్టళ్లు సిద్ధం చేశారు.    

భవిష్యత్‌ తరాలకు బలమైన పునాదులు 
ఏ దేశం, రాష్ట్రం అభివృద్ధికైనా విద్య, వైద్య రంగాలు గట్టి పునాదులు. యూరప్‌తోపాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, క్యూబా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాలు అనేక రంగాల్లో ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే. దూరదృష్టితో సీఎం జగన్‌ రేపటి తరాల భవిత కోసం  విద్య, వైద్య రంగాలను బలోపేతం వేస్తున్నారు.  
    – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 

ఎన్నో ప్రయోజనాలు.. 
ఇన్నాళ్లూ ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు వచ్చినా ఫీజుల భారాన్ని భరించలేక ఎంబీబీఎస్‌ చదివేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కోర్సు పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతోంది. ఇక ఎన్‌ఎంసీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసే క్రమంలో రెండు మూడేళ్లు వృథా అవుతోంది. అంతేకాకుండా అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్‌–లోకల్‌గా పరిగణిస్తున్నారు.

ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం శుభ పరిణామం. ప్రైవేట్‌ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో పలు ప్రయోజనాలుంటాయి. బోధనాస్పత్రుల్లో అపారమైన క్లినికల్‌ మెటీరియల్, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉంటారు. 
     – డాక్టర్‌ బాబ్జీ, వైస్‌ చాన్సలర్, డా. వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 

క్లినికల్‌ స్కిల్స్‌ పెరుగుతాయి.. 
ప్రైవేట్‌ కళాశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా కొత్త వైద్య కళాశాలల్లో ఎంతో మెరుగైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. 25 ఏళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లను కళాశాలలు, ఆస్పత్రుల్లో నియమించారు. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వనరులున్నాయి.

దశాబ్దాలుగా సేవలందిస్తున్న జిల్లా ఆస్పత్రులనే బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశాం. దీంతో ఐపీ, ఓపీ, ఇతర సేవలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆస్పత్రులకు అనుసంధానమైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదవడం విద్యార్థులకు ఎంతో మంచిది. విద్యార్థుల్లో క్లినికల్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి భవిష్యత్‌కు ఎంతో మేలు చేస్తుంది.  
    – డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్, ఏపీఎంఎస్‌ఐడీసీ 

త్వరలో తరగతులు ప్రారంభం 
ప్రస్తుతం కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్‌ ముందుకు వెళుతున్నారు.  
    – డాక్టర్‌ నరసింహం, డీఎంఈ   

మరిన్ని వార్తలు