రయ్‌.. రయ్‌.. అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్‌–16.. గంటకు 120 కి.మీ స్పీడ్‌..

11 Feb, 2023 12:33 IST|Sakshi

శరవేగంగా అనకాపల్లి–ఆనందపురం ఆరు లేన్ల రహదారి 

 గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లే అవకాశం 

విశాఖ నగరానికి తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు 

98 శాతం పనులు పూర్తి.. మార్చి నెలాఖరుకు సిద్ధం

బుల్లెట్‌లా దూసుకుపోవచ్చు.. మెరుపు వేగంతో సాగిపోవచ్చు.. దాదాపు పూర్తి కావచ్చిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లేన్ల రహదారిపై గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. మార్చి నెలాఖరుకు పూర్తి కానున్న ఈ రోడ్డు విస్తరణతో విశాఖ నగరానికి ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. 

సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: సర్రున సాగిపోయేలా ఆరు లైన్ల రోడ్డు.. డివైడర్లపై ఆహ్లాదకరంగా వేలాది మొక్కల పెంపకం.. బ్రేకుతో పనిలేదు.. టోల్‌ప్లాజా వచ్చే వరకు వాహనాన్ని నిలపాల్సిన అవసరమే రాదు.. ఇవీ అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్‌–16 జాతీయ రహదారి ప్రత్యేకతలు. విశాఖ నగరానికి రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ కష్టాలను పరిష్కరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం శరవేగంతో సాగుతోంది.

రూ.2,013 కోట్లతో 50.8 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మెగా ఇంజనీరింగ్‌ డీబీఎల్‌ సంస్ధ 98 శాతం పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరు నాటికి జాతికి అంకితం చేసేందుకు వేగం పెంచింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంగా వాహనాలు ప్రయాణించేలా ఈ రహదారిని విస్తరించారు. టోల్‌ప్లాజా వద్ద తప్పితే మరెక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రతి రెండు కిలోమీటర్లకు సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పీడ్‌ డిస్‌ప్లే, స్పీడ్‌ కంట్రోల్, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ తెలుసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో, వంతెనల జంక్షన్లలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.  

ట్రాఫిక్‌ సమస్య నుంచి విముక్తి
చెన్నై–కలకత్తా 16వ నంబర్‌ జాతీయ రహదారి అనకాపల్లి, గాజువాక, ఎన్‌ఏడీ, విశాఖనగరం మీదుగా సాగిపోతుంది. రవాణా, ప్రజా రవాణా తదితర వాహనాలు విశాఖ నగరం మీద నుంచి రాకపోకలు చేయడంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం వరకు జాతీయ రహదారిని కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టడంతో నగరానికి ట్రాఫిక్‌ సమస్య తొలగిపోనుంది. కేవలం పనులు ఉన్నవారు మాత్రమే నగరంలోకి వస్తారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి వద్ద బైపాస్‌ నుంచి సబ్బవరం మీదుగా ఆనందపురం వద్ద జాతీయ రహదారికి చేరుకుంటాయి. దీంతో నగరానికి ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. విశాఖ నగరానికి ఇది బైపాస్‌ రోడ్డుగా ఉపయోగపడనుంది. సబ్బవరం దగ్గర ఒక ఇంటర్‌ చేంజ్‌ సెక్షన్, పెందుర్తి దగ్గర మరొకటి ఏర్పాటు చేయడంతో విశాఖనగరానికి వెళ్లేందుకు మరిన్ని దారులు ఏర్పడ్డాయి.  

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు 
ఈ జాతీయ రహదారి పొడవు 50.8 కిలోమీటర్ల మేర ఉంది. రోడ్డు పొడవున ఇరువైపులా 15 వేలకు పైగా మొక్కలు నాటడం, నిత్యం వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుకు మధ్యలో 32 వేలకు పైగా మొక్కలను నాటుతున్నారు.  

స్ధానికులకు నో టోల్‌ట్యాక్స్‌ 
ఈ రహదారిపై మొత్తం మూడు టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేయనున్నారు. క్లోజ్డ్‌ టోలింగ్‌ సిస్టమ్‌ ద్వారా అనకాపల్లి వద్ద మర్రిపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాలలో చేపట్టే టోల్‌ప్లాజాల వద్ద స్ధానికులు టోల్‌ఫీజు చెల్లించనక్కరలేదు. సరీ్వసు రోడ్డును ఏ టోల్‌ప్లాజాకు అనుసంధానం చేయడం లేదు. దీంతో స్ధానికులు టోల్‌ప్లాజాకు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేస్తున్నారు.  

రూ.2,013 కోట్లతో నిర్మాణం 
దాదాపు 35 గ్రామాలను తాకుతూ నిర్మిస్తున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.2,013 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. ఈ మార్గంలో అనకాపల్లి బైపాస్‌ వద్ద ఒకటి, సబ్బవరం, పెందుర్తి జంక్షన్లలో మూడు ఇంటర్‌ చేంజ్‌ సెక్షన్లు, రెండు రైల్వే వంతెనలతో పాటు 21 అండర్‌ బ్రిడ్జిలు, 10 వంతెనలు, 52 బాక్స్‌ కల్వర్టులు, 44 పైప్‌ కల్వర్టులు, 25 గ్రామాల వద్ద అప్రోచ్‌ రోడ్లు, 34 బస్‌స్టేషన్లు, 20 జంక్షన్లను రూపొందించారు. ఫ్లైఓవర్‌ల వద్ద గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును డీబీఎల్‌ సంస్ధ చేపడుతుంది. 

మార్చి నెలాఖరుకు పనులు పూర్తి  
జాతీయ రహదారి విస్తరణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరునాటికి పనులు పూర్తయ్యేలా వేగం పెంచాం. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి విస్తరణ పనులతో విశాఖ నగరానికి ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. రోడ్డుపై ప్రతి రెండు కిలోమీటర్ల వద్ద సీసీ కెమెరాలు, జాతీయ రహదారి కూడలిలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలకు తావు లేకుండా ఆధునిక విధానంలో నిర్మాణం చేపట్టిన జాతీయ రహదారి ఇది. వేగంతో వెళ్లినా ప్రమాదాలకు తావు లేకుండా జాతీయ రహదారి ఉంటుంది.  
– ప్రమోద్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్, డీబీఎల్‌ సంస్ధ 

మరిన్ని వార్తలు