పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి

14 Nov, 2022 06:20 IST|Sakshi
రిబ్బన్‌ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్, తదితరులు

‘అనకాపల్లి–అచ్యుతాపురం’ ప్రాంతం వైపు పరిశ్రమలు   

విశాఖ నుంచి కాకినాడ వరకు పారిశ్రామిక పరుగులు 

త్వరలోనే పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌కు సీఎం శంకుస్థాపన 

యమ రిబ్బన్‌ కంపెనీకి శంకుస్థాపన చేసిన మంత్రి అమర్‌నాథ్‌  

సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అచ్యుతాపురం, అనకాపల్లి రాష్ట్ర ముఖచిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలవనున్నాయన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ‘యమ రిబ్బన్‌ కంపెనీ’ నిర్మాణానికి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజులతో కలిసి అమర్‌నాథ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన యమ రిబ్బన్‌ కంపెనీ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 15.76 ఎకరాల్లో తమ శాఖను ఏర్పాటు చేస్తోందన్నారు.

ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డ్, బీహెచ్‌ఈఎల్‌ వంటి పరిశ్రమలతో విశాఖ పెద్ద పారిశ్రామిక నగరంగా వెలుగొందుతోందని గుర్తు చేశారు. ఇదే సమయంలో అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయంటే.. పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యమ రిబ్బన్‌ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.  

అందుబాటులో 25 వేల ఎకరాల భూమి.. 
విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, తుని, కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటికే 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యలమంచిలి నియోజకవర్గం పూడిమడకలో త్వరలోనే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారన్నారు.

అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీని నంబర్‌వన్‌ స్థానంలో నిలిపిందని తెలిపారు. టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ యమ రిబ్బన్‌ కంపెనీ ద్వారా 2వేల మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. చైనా జనరల్‌ కాన్సులేట్‌ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, న్యూఢిల్లీలో చైనా ఎంబసీ కార్యదర్శులు యు యాంగ్‌ డబ్లు్య జూన్‌ నిమి, ఏపీఐఐసీ జెడ్‌ఎం త్రినాథ్‌రావు, చైనా జనరల్‌ కాన్సులేట్‌ (కోల్‌కతా) జాలియు, యమ రిబ్బన్‌ కంపెనీ ఇండియన్‌ డైరెక్టర్‌ శివప్రసాద్, మేనేజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు