కొత్త చరిత్రకు ఏపీ చప్పట్లు

3 Oct, 2020 08:11 IST|Sakshi

వలంటీర్లు, సచివాలయ సేవకులకు ప్రజలు స్వచ్ఛంద సంఘీభావం

శుక్రవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రమంతటా పండుగలా కార్యక్రమం

పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో మద్దతు

నిజం! పింఛన్ల కోసం ఎండల్లో గంటల తరబడి మాడిపోయిన వృద్ధులు, వికలాంగుల్ని చూశాం.
రేషన్‌ కార్డు కోసం కాళ్లీడ్చుకుంటూ ఎన్ని రోజులు తిరిగామో లెక్క కూడా చెప్పలేం!!.

దరఖాస్తు ఏదైనా బస్సులెక్కి ఊళ్లుదాటి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటికీ స్వస్తి చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. సచివాలయ వ్యవస్థ దిగ్విజయంగా ఏడాది పూర్తిచేసుకుంది. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఇంటి ముంగిట వచ్చి వాలే గ్రామ వలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సహకారంతో అద్భుతంగా పనిచేశారు. కోవిడ్‌ మహమ్మారి ప్రబలిన క్షణాన దేశమంతటా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించటానికి తంటాలూ పడుతూ వ్యాధి భయంతో కన్నవారిని పిల్లలే వదిలేస్తున్న క్షణాన... ఏపీలో వలంటీర్లు్ల క్రమశిక్షణతో పనిచేశారు. ఇల్లిల్లూ చుట్టి... లక్షణాలున్న వారిని.. లేకుండానే వ్యాధిన పడ్డవారిని గుర్తించారు. ముందే చికిత్స అందించి కోవిడ్‌ భయాన్ని, మరణాల రేటును గణనీయంగా తగ్గించారు. అందుకే వారికి ఈ అభినందనలు. ఇదో చరిత్ర. యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటున్న సరికొత్త చరిత్ర!. సచివాలయ వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సైతం తన అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు వారి కృషికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. (చదవండి: గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు)

వలంటీర్లు కాదు.. వారియర్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మునుపెన్నడూ లేనంత వేగంగా, అవినీతికి తావులేకుండా తమకు అందుతున్న సేవలకు మద్దతుగా రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ సంతోషాన్ని ప్రకటించారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చప్పట్లతో మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమ నిర్వహణకు పిలుపునివ్వగా.. సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి చోటా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా కొనసాగించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తమ ఇంటి గడప వద్దనే అనేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన కోట్లాది మంది సామాన్యులు మొదలు.. ఐఏఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.  సొంత ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవలం తొమ్మిది నెలల్లోనే దాదాపు కోటి సంఖ్యలో ప్రజల సమస్యలు పరిష్కారమైన విషయం తెలిసిందే.  
నేను సైతం అంటూ సీఎం..


ఒంగోలు సమతానగర్‌లో చప్పట్లతో వలంటీర్లను అభినందిస్తున్న స్థానికులు

► గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్ల సేవలను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సైతం తన అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

► రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు, ప్రత్యేకించి అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకాల వల్ల లబ్ధి పొందిన పొదుపు సంఘాల మహిళలు పలుచోట్ల ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి, అభినందనల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

దేశాన్ని ఆకర్షించిన వ్యవస్థ
ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడాది కిత్రం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఐఏఎస్‌ల శిక్షణలో ఒక పాఠ్యాంశం అయ్యేంతగా ప్రాచుర్యం పొందింది. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సైతం కొనియాడారు. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ కూడా అభినందించారు.  


ఏలూరులో సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న మహిళలు

గ్రామ స్వరాజ్యం సాకారం
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సాకారం అయిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చి శుక్రవారానికి ఏడాది అయింది. గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే..

► గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇవాళ సాకారమవుతోంది. దాన్ని ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప చూడలేదు. కానీ ఇవాళ గ్రామ స్వరాజ్యం అంటే ఇదే అని రాష్ట్రంలో చూపిస్తున్నాము. అందుకు గర్వంగా ఉంది.

► ఏడాదిగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నాము. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందేలా చేశాము. గ్రామాల్లోనే ఉంటూ, మన ఇంటి వద్దకే వచ్చి, ఏ సహాయం కావాలన్నా, వివక్ష చూపకుండా, లంచాలకు తావు లేకుండా అన్నీ చేసి పెడుతున్న వలంటీర్ల సేవలు అభినందనీయం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రోత్సహిద్దాం.  

మరిన్ని వార్తలు