మత విద్వేషాలకు భారీ కుట్ర

8 Jan, 2021 10:46 IST|Sakshi

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు విచ్ఛిన్నకర శక్తుల యత్నం:సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

అన్నదమ్ముల్లా జీవిస్తున్న రాష్ట్ర ప్రజల్లో వైషమ్యాలను రగిల్చి మత సామరస్యాన్ని దెబ్బతీసే కుయుక్తులు

పథకం ప్రకారం ఆలయాలపై దాడులే ఇందుకు నిదర్శనం

సమాజాన్ని విడదీసేందుకే గుడులపై కుట్రదారుల గురి

ఇలాంటి దుశ్చర్యలను సమాజం అంతా కలసి అడ్డుకుందాం

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య పరిరక్షణ కమిటీలు

జీవో నెంబర్‌ 6 జారీ 

సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ విలేకరులతో మాట్లాడారు. 

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుశ్చర్యలు..
దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చానే కుట్ర జరుగుతోందన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో  మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. 

కమిటీల్లో అన్ని మతాలకు స్థానం..
మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్‌ వివరించారు. అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య  కమిటీలు దోహదం చేస్తామని సీఎస్‌ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

సీఎస్, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు
మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి డీజీపీ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైన్‌లతో పాటు ఇతర మతాలకు చెందిన ఒక మత పెద్ద ప్రతినిధిగా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ వెల్ఫేర్, సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, ఇతర భాగస్వామ్యులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వైస్‌ చైర్మన్‌గా జిల్లా ఎస్పీ ఉంటారు. జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవిన్యూ) కన్వీనర్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు.

రాష్ట్ర స్థాయి కమిటీ విధివిధానాలు..
మతవిద్వేషాలను రగిల్చేలా సందేశాలను ప్రచారం చేయడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై చర్చించాలి.
స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్, ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలి. మత సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలతో పాటు కార్యాచరణ సిద్ధం చేయాలి.
జిల్లా స్థాయి మతసామరస్య కమిటీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి
మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ కింద నమోదైన క్రిమినల్‌ చర్యలన్నింటినీ పరిశీలించాలి.
మతసామరస్యం వెల్లివిరిసేలా పాఠశాల, కళాశాల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి

జిల్లా స్థాయి కమిటీ విధివిధానాలు
జిల్లా స్థాయిలో ఏదైన సంఘటన వల్ల మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాన్ని పంపాలి. క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడే విధంగా జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలి.
గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.
సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి
భూములు, లేదా ఇతర సంఘటనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉన్నచోట్ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి.
ప్రార్థనా మందిరాలు, ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి.
ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణ పురోగతిపై సమీక్షించాలి.

కరెంట్‌ రంపం వాడిన దుండగులు
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్‌ రంపాన్నే రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సీఐడీ విభాగానికి అప్పగించామన్నారు.

ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహమూర్తులపై 2017లో రెండు, 2018లో మూడు, 2019లో ఒకటి, 2020లో 29, ఈ ఏడాది మూడు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి ఆరు చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్‌ అర్జునరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు