పేదల ఇళ్లకు రూ.4,376 కోట్లు

23 Nov, 2023 04:46 IST|Sakshi
నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించిన టిడ్కో గృహసముదాయం

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వెచ్చించిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.4,375.82 కోట్లు వెచ్చించింది. రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహ యోగం కల్పించేందుకు 30.75లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ + 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. 

రూ.3,694 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు 
ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం చేస్తోంది. యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం కూడా చేస్తోంది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇవ్వడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది.

17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో నిర్మిస్తున్న కొత్త ఊళ్లల్లో ఉచితంగా నీటి, విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి  వసతులను ప్రభు­త్వం సమకూరుస్తోంది. ఇలా సబ్సిడీపై 4,69,897 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ సరఫరాకు రూ.247.23 కోట్లు, 33,303 టన్నుల ఇనుముకు రూ.224 కోట్లు వెచ్చించింది. ఉచితంగా ఇసుక పంపిణీతో పాటు, ఇతర సామాగ్రిని సబ్సిడీపై అందించేందుకు మరో రూ.210.59 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,375.82 కోట్లు ఖర్చుచేయగా ఇందులో రూ.3,694 కోట్ల మేర లబి్ధదారులకు బిల్లుల రూపంలో చెల్లింపులు చేపట్టారు.   

మరిన్ని వార్తలు