కళ్లాల నుంచే విపణికి

20 Jan, 2022 05:10 IST|Sakshi

ఈ – ఫార్మర్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌తో రైతులు నేరుగా అమ్ముకునే సౌలభ్యం

ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే చాలు

ఆన్‌లైన్‌లో నచ్చిన రేటుకు విక్రయించుకునే అవకాశం

వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతకు ప్రభుత్వం సర్టిఫికెట్‌ 

10 వేలమంది వ్యాపారులు, 50 వేలమంది రైతుల నమోదు లక్ష్యం  

కనీసం రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం

నాలుగు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం

త్వరలో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రైతులు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మార్కెట్‌ ద్వారా కల్పిస్తోంది. రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్‌లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ పోర్టల్‌ ఇదే కావడం గమనార్హం. మండీలకు ప్రత్యామ్నాయంగా తెచ్చిన ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రైతులను రాష్ట్ర పరిధిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ట్రేడర్స్‌తో అనుసంధానిస్తారు. నాణ్యమైన ఉత్పత్తులు, నిల్వ సామర్థ్యం, ఆర్ధిక చేయూత లాంటి సేవలను ఒకే వేదిక కిందకు తీసుకు రావడం ద్వారా అవాంతరాలు లేని వాణిజ్యాన్ని సృష్టించాలన్న సంకల్పంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం తెచ్చింది. వ్యవసాయ రంగంలో డిజిటల్‌ వ్యాపారాన్ని ప్రవేశపెట్టి మార్కెటింగ్‌ విలువను పెంచుతున్నారు.  

ఈ– విక్రయ కార్పొరేషన్‌ 
ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ద్వారా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వహణ కోసం కంపెనీల చట్టం–2013 కింద ప్రత్యేకంగా ‘ఏపీ ఫార్మర్స్‌ ఈ–విక్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ఏర్పాటైంది. ఫామ్‌గేట్‌ వద్ద మౌలిక సదుపాయాలతో పాటు నిబంధనల ప్రకారం లావాదేవీల నిర్వహణ, రవాణా, చెల్లింపులు, వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేశారు.

పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం
ఈ–ఫార్మార్కెటింగ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. 108 మంది వ్యాపారులు, 254 మంది రైతులు రూ.4.04 కోట్ల విలువైన 294 వ్యాపార లావా దేవీలను దీనిద్వారా నిర్వహించారు. 2022–23లో 10,200 మంది వ్యాపారులు, 50 వేల మందికి పైగా రైతులను భాగస్వాములుగా చేయడం ద్వారా కనీసం రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలను ఈ–ఫార్మార్కెటింగ్‌  మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతుకు రొఖ్కం.. ట్రేడర్‌కు సుఖం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గూటపాడు రైతు కరువా వెంకటేశ్వర్లు ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. ఈ – మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా నంద్యాలకు చెందిన వ్యాపారి కృష్ణారెడ్డికి 125 క్వింటాళ్ల మొక్కజొన్నను క్వింటాల్‌ రూ.1,700 చొప్పున విక్రయించారు. వ్యాపారి నేరుగా కళ్లం వద్దకు వచ్చి కొనుగోలు చేశారు. తరుగు తీయకుండా రేటు కట్టారు. 24 గంటలు తిరక్కుండా నే వెంకటేశ్వర్లు ఖాతాకు డబ్బులు జమ అయ్యాయి.

రైతులకు ప్రయోజనాలివీ
► వ్యవసాయ క్షేత్రం నుంచే తమ ఉత్పత్తులను ఎలాంటి ఫెసిలిటేషన్‌ రుసుము, దళారీల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించవచ్చు.
► ఉత్పత్తి లభ్యత, పంట వివరాలను ముందుగానే పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.
► స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల వివరాలు పోర్టల్‌లో ఉన్నందున నేరుగా సంప్రదించవచ్చు.
► చెల్లింపులన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనుండడంతో మోసాలకు ఆస్కారముండదు.
► ఫామ్‌గేట్‌ స్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ధరలను ప్రదర్శించడం రైతుల్లో బేరసారాల శక్తి పెరుగుతుంది.
► ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తారు.

కొనుగోలుదారులకూ లాభమే
►ప్లాట్‌ఫామ్‌లో వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నందున నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చు. తదనుగుణంగా వ్యాపార విస్తరణ ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.
► రైతుల నుంచి కొనుగోలు చేసే పంట ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫైడ్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నందున నాణ్యతకు ఢోకా ఉండదు. 
► నిల్వ చేసుకునేందుకు వేర్‌హౌస్‌ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇది ముఖ్యమంత్రి విజన్‌..
ఇప్పటివరకు పంటను దళారీలకు లేదా ప్రభుత్వానికి విక్రయించడం ఒక్కటే రైతన్నలకు తెలుసు. పంటలను కొనేవారు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరినీ రైతులకు పరిచయం చేయడం ద్వారా బేరసారాలు సాగించే శక్తిని పెంచాలనే  ఆలోచనతో ఈ ఫార్మార్కెటింగ్‌ను తీసుకొచ్చాం. దీంతో దళారీ వ్యవస్థకు తెరపడుతుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 
– పీఎస్‌ ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు