దేశం అనుకరించేలా ఏపీ విజన్‌ ప్రణాళిక–2047

28 Oct, 2023 05:09 IST|Sakshi
నీతి ఆయోగ్‌ అధికారులతో మాట్లాడుతున్న సీఎస్‌

ఆ మేరకు విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలన్న నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి వి.రాధా 

సాక్షి, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విజన్‌ ప్రణాళిక–2047ను అనుకరించేలా అద్భుతమైన విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించాలని నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి వి.రాధా.. రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై వర్క్‌ షాపులో ఫలవంతంగా చర్చలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ వర్క్‌ షాపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర విద్యా రంగంపై సుదీర్ఘ చర్చ జరిగింది.

వి.రాధా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సంస్కరణలపై విద్యా వేత్తలు, మేథావులు పలు సూచనలు చేశారని, వాటిని అమలు చేయాలంటే కేంద్ర స్థాయిలోని పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు.

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాశ్యత శాతం పెంపుతో పాటు రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను ప్రాథమిక స్థాయి నుంచే అందజేస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్ర విజన్‌ ప్రణాళిక–2047లో భాగంగా పాఠశాల విద్యా విభాగం లక్ష్యాలు, అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళి కలను వివరించారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, విద్యా వేత్తలు ప్రసంగించారు. నీతి ఆయోగ్‌ డీఎంఈవో డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ కుమార్, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్, ఏపీఎస్‌ఎస్డీసీ సీఈవో ఎండీ డా.వినోద్‌ కుమార్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ సి.నాగరాణితో పాటు నీతి ఆయోగ్‌ సలహాదారులు సీహెచ్‌ పార్థసారథిరెడ్డి, పబ్లిక్‌ పాలసీ నిపుణుడు అమ్రిత్‌ పాల్‌ కౌర్, సీనియర్‌ కన్సెల్టెంట్‌ శైలీ మణికర్, పర్యవేక్షణ, మూల్యాంకన నిపుణుడు బిప్లప్‌ నంది, బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూపు ప్రతినిధి అభిషేక్‌ పాల్గొన్నారు.   

కేంద్ర నిధులకు సిఫార్సు చేయండి: సీఎస్‌  
విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్‌ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసింది. నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్‌ కేంద్రానికి తగిన సిఫార్సులు చేయాలని సీఎస్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు