TIDCO Houses: వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ

24 Jun, 2022 18:47 IST|Sakshi

విజయనగరంలో 800 టిడ్కో ఇళ్ల పంపిణీ

రేపు శ్రీకాకుళం పాత్రునివలస–1లో మరో 800

రేపటి నుంచి వరుసగా ఇళ్ల పంపిణీకి షెడ్యూల్‌

డిసెంబర్‌ చివరికి 2,62,216 గృహాల పంపిణీకి ఏర్పాట్లు

అన్ని మౌలిక వసతులతో సిద్ధమవుతున్న నివాసాలు

సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సారిపల్లిలో నిర్మించిన 800 యూనిట్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందచేసింది. ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలస–1లో మరో 800 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తాగునీరు, రోడ్లు, సెప్టిక్‌ ట్యాంకులు, ఎస్టీపీలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో సిద్ధమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. 

నాడు ఎన్నికలకు ముందు అరకొరగా...
రాష్ట్రవ్యాప్తంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 36,064 ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్‌ ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది. 365 చ.అ విస్తీర్ణంలోవి 13,968 ఇళ్లు, 430 చ.అడుగుల్లోవి మరో 21,040 యూనిట్లు ఉన్నాయి. వీటిని 50 శాతం రాయితీతో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులపై భారం మోపుతూ ఎన్నికల ముందు అరకొరగా టిడ్కో ఇళ్లను చేపట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి మౌలిక సదుపాయాలతో వీటిని సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రోడ్లు, పార్కులతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రతి నిర్మాణానికి సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) నిర్మించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఈమేరకు సర్వ హంగులతో టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి.  

పేదలపై రిజిస్ట్రేషన్ల భారం పడకుండా..
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 98 పట్టణ స్థానిక సంస్థల్లో మూడు విభాగాల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్‌ నాటికి 1.32 లక్షలకుపైగా యూనిట్లను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్‌ చివరినాటికి అన్ని సదుపాయాలతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నారు. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి ప్రభుత్వం అందిస్తోంది. ఒక్క రిజిస్ట్రేషన్ల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకుపైగా భారాన్ని భరిస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు