సంక్షేమం కూడా అభివృద్ధిలో భాగమే 

16 Dec, 2022 05:50 IST|Sakshi
మాట్లాడుతున్న కృష్ణంరాజు

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి 

నీతి ఆయోగ్‌ సూచీల్లో పలు విభాగాల్లో ఏపీ అగ్రస్థానం 

ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలది దుష్ప్రచారం 

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయని, సంక్షేమం కూడా అభివృద్ధిలో భాగమేనని పలువురు వక్తలు స్పష్టంచేశారు. ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘ఆంధ్రాలో అభివృద్ధి–సంక్షేమం–వాస్తవాలు–వక్రీకరణ’ అనే అంశంపై విజయవాడలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 11.43 శాతం ఆర్థికాభివృద్ధితో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలు నేరుగా నిరుపేదలకు అందుతున్నాయని, అయినా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదన్నారు.

వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ నేత చందు సాంబశివరావు మాట్లాడుతూ ఏపీలో ఆర్థిక సంక్షేమమేగాని సంక్షోభం లేదని, శ్రీలంకతో మన రాష్ట్రాన్ని పోల్చడం భావ్యం కాదన్నారు. బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ కో–కన్వీనర్‌ లఖంరాజు సునీత మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ సూచీల్లో పలు విభాగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్ర నుంచి ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలతో వివరించారు.

జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జంపా కృష్ణకిషోర్‌ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై కేంద్ర నివేదికలకు భిన్నంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ నేరుగా నగదు ప్రజలకు అందడం వల్ల వారు దానిని వస్తుసేవల విక్రయానికి ఉపయోగిస్తారన్నారు. దీంతో వాటికి డిమాండ్, సరఫరా, ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరుగుతుందని వివరించారు.

వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2020–21లో దేశంలో రూ.6.3 లక్షల కోట్ల నగదును నేరుగా ప్రజలకు బదిలీ చేయగా.. దానిలో పది శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరిగిందని చెప్పారు. బెజవాడ మీడియా సెంటర్‌ అధ్యక్షుడు చందన మధు, డీబీఎఫ్‌ జాతీ­య కార్యదర్శి మేళం భాగ్యారావు, సీనియర్‌ పాత్రికేయుడు బ్రహ్మయ్య తదితరులు ప్రసంగించారు.   

మరిన్ని వార్తలు