యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..

10 Oct, 2022 16:38 IST|Sakshi

9వ తరగతి విద్యార్థులకు వారానికో రోజు ప్రత్యేక శిక్షణ

పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలే లక్ష్యం

25,000 మంది విద్యార్థులకు ప్రయోజనం 

రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.  


450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్‌ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్‌ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్‌గాట్, రీపీ బెనిఫిట్‌ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్‌ పర్సన్స్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్‌ అందజేశారు.    


25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం
 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. 

ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్‌: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..)


లక్ష్యాలు చేరుకునేందుకు 

విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. 
– సీహెచ్‌ ఉదయ్‌కుమార్, డిస్ట్రిక్ట్‌ మేనేజర్, ఈఎండీపీ 


సద్వినియోగం చేసుకోవాలి 

నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. 
– ఎన్‌వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా 


మంచి ఆలోచన 

విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. 
– ఎస్‌ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా

మరిన్ని వార్తలు