రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి

18 Oct, 2023 04:38 IST|Sakshi
వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్న పీడిక రాజన్నదొర

సబ్‌ప్లాన్‌ నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలి

అధికారులకు ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆదేశం  

సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ):  రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభి­వృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్‌ నిధుల విని­యో­గాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజ­నులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.

ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, డైరెక్టర్‌ జె.వెంకటమురళి, ట్రైకార్‌ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్‌సైట్‌ 
గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్‌సైట్‌ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు.  సీఎం జగన్‌ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు.

గిరిజనులకు డీఆర్‌ డిపోల ద్వారా రేషన్‌ సరుకుల సరఫరా, పెట్రోల్‌ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్‌ ఔట్‌లెట్‌ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్‌ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ  సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్‌సైట్‌ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్ కుమార్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ షాపింగ్‌తో పాటు సోషల్‌ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్, ట్రైకార్‌ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు