సామాజిక సాధికారతకు జై కొట్టిన కొత్తపేట 

17 Nov, 2023 05:33 IST|Sakshi
కొత్తపేటలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి

బస్సు యాత్రకు పోటెత్తిన జనం 

మహిళలు అత్యధికంగా హాజరు 

బైక్‌లతో భారీ ర్యాలీ చేసిన యువత

యాత్రకు గజమాలలతో స్వాగతం పలికిన ప్రజలు 

జగన్‌ గెలుపు మన అవసరం అన్న మంత్రులు 

సాక్షి అమలాపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాధించిన సామాజిక సాధికారతకు కొత్తపేట జై కొట్టింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలిరావడంతో కొత్తపేట మెయిన్‌ రోడ్డు జన గోదావరిని తలపించింది.

ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. యువత మోటార్‌ సైకిల్‌ ర్యాలీతో యాత్రను అనుసరించారు. ప్రజలు పూలు జల్లుతూ భారీ గజమాలలతో ఎదురేగి యాత్రకు స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తపేట సభలో పాల్గొన్నారు. సీఎం జగన్‌ సామాజిక విప్లవం, సంక్షేమ పాలనను వివరించినప్పుడు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేశారు.  

సామాజిక న్యాయం చేసింది జగన్‌ ఒక్కరే: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 
పార్టీలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక్కరే నని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక నిర్వహించిన కలెక్టర్ల  సమావేశంలో వారి వాళ్లకు, ఆయన పార్టీ వాళ్లకు మాత్రమే పని చేయాలని చెప్పారన్నారు.

సీఎం జగన్‌ మాత్రం కులం, మతం, పార్టీలు అని చూడకుండా ప్రతి పేదవాడికీ మేలు చేయాలని చెప్పారని, అదే చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం జగన్‌ చేస్తున్న కృషి నభూతో నభవిష్యతి అని చెప్పారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీర మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య ఎంపీలు అయ్యారంటే అందుకు జగన్‌ కారణమన్నారు. 

ఇది దేశంలోనే ఒక చరిత్ర: మంత్రి చెల్లుబోయిన 
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్‌ ఈ వర్గాలను అక్కున చేర్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. చంద్రబాబు పాలనలో వివక్షకు గురైన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి, సంక్షేమ పథకాల ద్వారా వారి అభ్యు­న్నతికి సీఎం కృషి చేస్తున్నారని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు.  

పేదలవైపు ఉన్నది జగన్‌ ఒక్కరే: శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు 
రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న పోరాటంలో పేదల వైపు ఉన్నది జగన్‌ ఒక్కరేనని శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల వారికి ఉన్నత పదవులు అందించి, ఈ వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ చర్యలు చేపట్టారని వివరించారు. 

జగన్‌  గెలుపు మన అవసరం: మంత్రి మేరుగు నాగార్జున 
సీఎం జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరమని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇంతమంది వెనుకబడిన, దళిత వర్గాల వారం వేదిక మీద ఉన్నామంటే సీఎం జగనే కారణమని అన్నారు. వెనుకబడిన వారిని జగన్‌ బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్యాస్ట్‌గా గుర్తించారని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంతోపాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను సీఎం జగన్‌ అందిస్తున్నారని, దీని వల్ల వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతోందని వివరించారు.  

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ: ఎంపీ మార్గాని భరత్‌ 
గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా సీఎం జగన్‌ సచివాలయ వ్య­వస్థను తీసుకొచ్చారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు తేవడంలో జగన్‌ ఒక శక్తిలా పని చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారో తీసేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు సూర్యనారాయణ­రావు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు