ఏపీకి గుడ్ న్యూస్.. మరో రీజనల్‌ పాస్‌ పోర్టు కేంద్రం ఏర్పాటు

28 Oct, 2023 12:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్‌ పాస్‌ పోర్టు ఆఫీసర్‌ శివ హర్ష ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

కాగా, శివ హర్ష శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు రెండు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. కోవిడ్ తరువాత పాస్ పోర్ట్  అప్లికేషన్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెల వరకు మూడు లక్షల  పాస్ పోర్టులు జారీ చేశాం. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నాం. విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్  ప్రింటింగ్ ప్రారంభమవుతుంది. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయి.

మరో రెండు మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తాం. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశాం. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నాం. దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మకండి’ అని సూచించారు. 

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం 

మరిన్ని వార్తలు