కోవిడ్‌పై యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

4 Dec, 2020 23:31 IST|Sakshi

కరోనా, ఆరోగ్యశ్రీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 పరీక్షలు 

ప్రతి పది లక్షల జనాభాకు 1,91,568 టెస్టులు

నాడు-నేడుతో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

సాక్షి, అమరావతి: గత తొమ్మిది నెలలుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ దీటుగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,02,29,745 పరీక్షలు చేశామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,91,568 పరీక్షలు చేశామని, జనాభాలో 19.15 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. కోవిడ్‌ పరీక్షల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తొలిస్ధానంలో ఉందన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే టెస్టింగ్‌ చాలా ముఖ్యమని, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ ఈ మూడింటిపైన ప్రభుత్వం అత్యంత వేగంగా వ్యవహరించిదని తెలిపారు.

కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, నాడు-నేడుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. దాదాపు 85 శాతం పరీక్షలు క్లస్టర్లలోనే చేశామని, త్వరితగతిన టెస్ట్‌లు చేసి చికిత్స చేస్తే మనుషులను కాపాడుకోవచ్చని, అదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాజిటివిటీ రేటు సగటున 16 శాతం నుంచి 8.51 శాతానికి తగ్గిందని, ఈ వారంలో 1.48 శాతం మాత్రమే ఉందన్నారు. దేవుడి దయ, అందరూ అప్రమత్తంగా ఉండటంతో వైరస్‌ వ్యాప్తి తగ్గిందని తెలిపారు. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉండగా, మన దగ్గర కేవలం 0.81 శాతం మాత్రమే ఉందన్నారు. గతంలో​ రోజుకు 100 మంది చనిపోగా ఇప్పుడు 7 నుంచి 8 మందికి తగ్గిందని, అది కూడా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 150 టెస్టింగ్‌ ల్యాబ్‌లు. 1,519 శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాలు రాష్ట్రంలో పని చేస్తున్నాయని తెలిపారు. రాబోయే మూడేళ్లలో రూ.16 వేల కోట్లు వెచ్చించి వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని ప్రకటించారు. 

కోవిడ్‌ పోరాట యోధులకు కృతజ్ఞతలు..
రాష్ట్రంలో కరోనా బారిన పడిన ప్రజల సంఖ్య 8,70,076. రికవరీ అయిన వారు 8,56,320 మంది కాగా 7,014 మంది చనిపోయారు. మరో 6,742 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇంతమంది కోలుకున్నారంటే ఎంత శ్రమకోర్చామో తెలుసుకోవచ్చు. ఇందుకు మన డాక్టర్లు, నర్సులు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్లు.. అందరికీ కృతజ్ఞతలు. 

దేశమంతా అభినందిస్తోంది..
రాష్ట్రంలో ప్రస్తుతం రోజూ దాదాపుగా 800 కేసులు కనిపిస్తున్నాయి. రోజుకు సగటున 70 వేల టెస్టులు చేస్తున్నాం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌.. ఈ మూడింటిపై ప్రభుత్వం పరుగులు తీసింది. మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి టయర్‌-1 నగరాలు లేవు. అత్యంత మెరుగైన వైద్య సేవలందించే పెద్ద ఆస్పత్రులు లేవు. అది మనకున్న ప్రధాన లోటు. కరోనాను కట్టడి చేయాలి అంటే టెస్టింగులు చాలా ముఖ్యం. దాదాపు 85 శాతం పరీక్షలు క్లస్టర్లలో చేశాం. త్వరితగతిన పరీక్షలు చేసి చికిత్స అందిస్తే మనిషిని కాపాడుకోవచ్చు. అలా పని చేశాం కాబట్టే దేశం మొత్తం మనల్ని అభినందిస్తోంది.

నాడు ఒక్క ల్యాబ్‌ కూడా లేదు..
కరోనాతో యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదు. శాంపిల్స్‌ పుణె పంపాల్సి వచ్చేది. ఇవాళ 150 ల్యాబ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,02,29,745 పరీక్షలు చేశాం. ప్రతి 10 లక్షల జనాభాకు 1,91,568 పరీక్షలు అంటే 19.15 శాతం. దాదాపు 20 శాతం జనాభాకు టెస్ట్‌లు చేయగలిగాం. రాష్ట్రాలపరంగా చూస్తే పరీక్షల్లో  ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి సగటున 8.51 శాతానికి తగ్గింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉండగా మన దగ్గర కేవలం 0.81 శాతం మాత్రమే ఉంది. 150 టెస్టింగ్‌ ల్యాబులు. 1519 శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో పని చేస్తున్నాయి.

ఫిర్యాదులు రాకుండా..
మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్‌ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. మన రాష్ట్రంలో అలాంటి ఫిర్యాదులు రాలేదు. అందుకు కారణం ప్రభుత్వం 243 ఆస్పత్రులను అధీనంలోకి తీసుకుంది. వాటిల్లో 120కి పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. 21,206 మంది వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాం. అన్ని ఆస్పత్రులలో 37,044 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఐసీయూ బెడ్లు 4,516, నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు 18,518, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు 13,517 ఉన్నాయి. వెంటిలేటర్లు గతంలో 56 ఉండగా ఇవాళ 4,500 అందుబాటులో ఉన్నాయి.

ఒక్క కాల్‌తో అన్ని సేవలు..
ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే 104 నెంబరుకు ఫోన్‌ చేస్తే చాలు టెస్టింగ్‌, అవసరమైతే ఆస్పత్రిలో చేర్చడం, బెడ్‌ సమకూర్చడం, చికిత్స తర్వాత తిరిగి ఇంటికి పంపించడం వరకు అన్ని సేవలు ఒక్క కాల్‌తో పొందేలా సదుపాయాలు కల్పించాం. వలంటీర్లు, ఆశా వర్కర్లు చాలా కష్టపడ్డారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబతున్నా. గ్రామంలో ఎవరు కొత్తగా వచ్చినా వైద్య పరీక్షలు చేయడం, కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రులకు పంపించడం లాంటి సేవలు చాలా చక్కగా అందించారు.
 
ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన వైద్యం..
ఇవాళ రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు 30 డోసులు ప్రతి ఆస్పత్రిలో ఉన్నాయి. ఒక్కోదాని ఖరీదు రూ.5,500. ఒక్కొక్కరికి కనీసం 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చే రూ.30- రూ.35 వేల వరకు ఉంది. పాక్సులీజోమా ఒక్కో ఇంజెక్షన్‌ ఖరీదు రూ.17 వేలు. ఇవి కూడా ప్రతి జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరినీ మానవతా దృక్పథంతో ఆదుకుంటాం. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుతాం. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. పారాసిటమాల్‌ లాంటి మాత్రల ద్వారా నయం అవుతుంది. 14 శాతం మంది ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. 1 శాతం మంది మాత్రం వెంటిలేటర్‌పై చికిత్స పొందాల్సి ఉంటుంది. 

ఇంట్లో ఐసొలేషన్‌కు అవకాశం లేని వారికి కోవిడ్‌ కేర్‌ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. అక్కడ వారికి మంచి ఆహారం ఇస్తారు. వైద్య సదుపాయాలుంటాయి. పూర్తిగా బాగైన తర్వాతే ఇంటికి పంపిస్తారు. దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం కాబట్టే అందరినీ కాపాడగలిగాం. ప్రతి ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలతోపాటు హెల్ప్‌ డెస్కులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 
 
టెలి మెడిసిన్‌కు 14410 ...
14410 కు ఫోన్‌ చేస్తే వైద్య సహాయం అందుతుంది. తొలుత కోవిడ్‌కు పరిమితం చేసినా ఆ తర్వాత అన్నిటికీ విస్తరించాం. ఆ నెంబరుకు కాల్‌ చేస్తే వైద్యులు మాట్లాడతారు.  మందులు డోర్‌ డెలివరీ చేస్తారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చే విధంగా 9,706 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాం. కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రులలో 21,226 డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించాం. 

మరికొన్నాళ్లు జాగ్రత్తగా ఉందాం..
కోవిడ్‌ వ్యాప్తిలో ఇప్పుడు చివరి దశకు వచ్చాం. ఇంకా కొద్ది నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉంటే గండం నుంచి బయటపడొచ్చు. అమెరికాలో మొన్న ఎన్నికలు జరిగాయి. ఇవాళ అక్కడ రోజుకు 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 2,500 మంది రోజూ చనిపోతున్నారు. ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఇక బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. కాబట్టి మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాక్సీన్‌ రావడానికి మరో 3, 4 నెలలు పట్టొచ్చని కేంద్రం చెబుతోంది. ఒకవేళ వచ్చినా మొత్తం రాష్ట్ర జనాభాకు అందకపోవచ్చు. తొలుత కోటి మందికే వాక్సీన్‌ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారికి వాక్సీన్‌ ఇవ్వడానికి సమయం పడుతుంది. చలి పెరుగుతోంది కాబట్టి కరోనా కేసులు పెరుగుతున్నాయి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ మాత్రమే కాకుండా దేశంలో ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళలో కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాం కాబట్టి కొద్ది నెలలు జాగ్రత్తగా ఉంటే పరిస్థితిని పూర్తిగా అదుపు చేయొచ్చు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్, సబ్బుతో చేయి కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పను..
కేంద్ర ప్రభుత్వం తొలి దశలో కోటి మందికి వాక్సీన్‌ అందచేస్తామని తెలియచేసి రాష్ట్రం నుంచి ప్రణాళిక కోరింది. తొలి దశలో 3.60 లక్షల హెల్త్‌కేర్‌ వర్కర్లు, 7 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది (పోలీసులు, రెవెన్యూ తదితర ఉద్యోగులు), 50 ఏళ్లకు పైబడిన వారు మరో 90 లక్షల మంది ఉన్నారు. టీకా నిల్వ చేసేందుకు దాదాపు 4,065 కోల్డ్‌ ఛెయిన్‌ ఎక్విప్‌మెంట్‌ కావాలి. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల లోపు వాక్సీన్లు ఉంచాలి. వాక్సీన్‌ రవాణా కోసం 29 రిఫ్రిజిరేటెడ్‌ వాహనాలు సిద్ధంగా ఉండాలి. ఇన్ని చేస్తున్నా ఇవన్నీ బయటకు కనిపించవు. లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బయటకు నేనేమీ చెప్పను. ‘నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నా. నాకు నిద్ర లేదు’ అని చెప్పను. సీఎం హోదాలో మనం మానిటర్‌ చేయాలి. దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ బాగా పని చేస్తున్నారు. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. 

ఆరోగ్యశ్రీ..
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో దివంగత వైఎస్సార్‌ ఒక అడుగు వేస్తే ఆయన కుమారుడిగా ఆ పథకాన్ని నాలుగు అడుగులు ముందుకు తీసుకు వెళ్తున్నా. 1,000 నుంచి 2,059 వ్యాధులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 2,436 ప్రొసీజర్లకు (చికిత్స ప్రక్రియలు) వర్తించేస్తూ రాష్ట్రమంతా పథకం అమలు చేస్తున్నాం. బయటి రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ చికిత్స కోసం 130 ఆస్పత్రులు గుర్తించాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలు తీర్చాం. మొత్తం 1,406 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కాగా ప్రభుత్వ ఆస్పత్రులు 713, ప్రైవేటు ఆస్పత్రులు 693 ఉన్నాయి. గ్రీన్‌ ఛానల్‌లో పెట్టాం కాబట్టి బిల్లుల చెల్లింపులకు మూడు వారాలకు మించి పట్టడం లేదు. 

ఆరోగ్య ఆసరాతో విప్లవాత్మక మార్పు
ఎవరూ ఊహించని విధంగా ఆరోగ్య ఆసరా పథకం అమలు చేస్తున్నాం. ఆపరేషన్‌ తర్వాత వైద్యులు సూచించినంత కాలం రోగి ఇంట్లో విశ్రాంతి పొందే సమయంలో నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. డయాలసిస్, బోదకాలు, పక్షవాతం, కిడ్నీ, లివర్‌ మార్పిడి, మల్టీ డిఫామిటీ, లెప్రసీతో బాధ పడుతున్న వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్‌ చెల్లిస్తున్నాం. లెప్రసీ బాధితులకు రూ.3 వేలు ఇస్తున్నాం. 

హెల్ప్‌ డెస్కులు-ఆరోగ్యమిత్రలు: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు గ్రేడింగ్‌ ఇస్తున్నాం. అన్ని ఆస్పత్రులలో డిసెంబరు 10వ తేదీ నాటికి ఆరోగ్యమిత్రలు ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఉంటారు.  రోగులను చేయి పట్టి నడిపిస్తారు. ఆస్పత్రిలో వైద్యం, ఆహారం, శానిటేషన్‌పై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తారు.

సమూల మార్పులు..
ఇటీవల 1068 అంబులెన్సులు ఒకేసారి అన్ని చోట్లకు పంపించాం. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, అంబులెన్సుల పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. అందుకు నాడు-నేడు కార్యక్రమం చేపట్టాం. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లలో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు ఉంటాయి. 14 రకాల పరీక్షలు చేస్తారు. ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్టు చేస్తారు. 24/7 అందుబాటులో ఉంటారు. విలేజ్‌ క్లినిక్‌లు మొదలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, చివరకు టీచింగ్‌ ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నాం. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉండగా కొత్తగా మరో 16 వస్తున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అవి ఏర్పాటవుతాయి. రానున్న మూడేళ్లలో అక్షరాలా రూ.16 వేల కోట్ల ఖర్చుతో వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న తపనతో పని చేస్తున్నాం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు