AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్‌ కీలక ఆదేశాలు

8 Apr, 2022 16:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

చదవండి: AP: కేబినెట్‌ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ

బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు