APPSC : జాబ్స్‌ పిలుపు.. 897 పోస్టులతో గ్రూప్‌–2 నోటిఫికేషన్‌

8 Dec, 2023 04:12 IST|Sakshi

331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

21 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌

ఫిబ్రవరి 25న ఆఫ్‌లైన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ

త్వరలోనే గ్రూప్‌–1తో పాటు పలు నోటిఫికేషన్లు

త్వరలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌
ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్‌–1 పోస్టు­లతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్‌ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియా­మ­కాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధి­గమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్‌ తాజాగా గ్రూప్‌–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.

సాక్షి, అమరావతి: యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్‌ సైతం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆఫ్‌లైన్‌ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. 

మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి
కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ 16, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏఓ), సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్‌ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది.

వెబ్‌సైట్‌లో సిలబస్‌
అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్‌–1, పేపర్‌–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు. 

>
మరిన్ని వార్తలు