రూ.19,037 కోట్ల విలువైన
10 ప్రాజెక్టులకు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.
అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి..
ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు.
ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు..