‘కందుకూరులో జనసంద్రం’ బెడిసి కొట్టింది.. చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సజ్జల

29 Dec, 2022 17:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్‌ బెడిసి కొట్టిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కందుకూరు తొక్కిసలాట ఘటనపై గురువారం సాయంత్రం సజ్జల పాత్రికేయ సమావేశం ద్వారా స్పందించారు. కావాలనే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారని ఈ సందర్భంగా సజ్జల, చంద్రబాబుపై మండిపడ్డారు. 

జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, ఆ పబ్లిసిటీకి ఎనిమిది మంది బలయ్యారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా?.  అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారు. పైగా పోలీసులపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా?’’ అని చంద్రబాబును నిలదీశారు సజ్జల. ఆ ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహణ ద్వారా.. డ్రోన్‌ షాట్లతో జనాలు బాగా వచ్చారని చూపించుకునే ప్రయత్నం చేశారు. కందుకూరు తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు సజ్జల. 

ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి  ఏం మాట్లాడారంటే..

చంద్రబాబు నరబలి
కందుకూరు ఘటనపై చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపమే కనిపించడం లేదన్నారు సజ్జల. ఆయనలో లెక్కలేనితనం, అహంకారమే కనిపిస్తోంది. ఈ దుర్ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష నేత యత్నించడం సిగ్గు చేటన్నారు  సజ్జల. ఏది జరిగినా సెన్సేషన్‌ చేసుకోవాలన్నదే చంద్రబాబు ఆరాటమని, ఆయన వికృత విన్యాసంలో ఈ నరబలి జరిగిందని భావిస్తున్నామని సజ్జల అభిప్రాయపడ్డారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్నారు. అప్పుడు ఆ ఘటనపైనా అహంకారంతో చంద్రబాబు మాట్లాడారని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబుకు ప్రాణాలంటే లెక్కలేదని, సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా చంద్రబాబు లేరని సజ్జల విమర్శించారు.

బాబు రాజకీయ జీవితమే అది
నిన్నటి ఘటన ముమ్మాటికి ప్రమాదం కాదు. ఒక వ్యూహం ప్రకారం అమలు చేసిన యాక్షన్‌ ప్లాన్‌. చంద్రబాబు వికృత విన్యాసానికి దారుణ నరబలిగా చూడాల్సిందే. ఎందుకంటే, ఆయన రాజకీయ జీవితం అలాంటిది.   1994లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్‌ను ఏడాది కాలంలోనే  ఏ విధంగా పదవి నుంచి దించాడో.. ఏ రకంగా ఆయనను ఇబ్బందులు పెట్టి మానసికంగా కుంగిపోయేలా చేసి, చివరకు మరణానికి కారకుడుగా మిగిలాడనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా తాను అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మంది అమాయక భక్తుల్ని బలి తీసుకున్నారు. అంత నీచమైన చరిత్ర చంద్రబాబుది.

కోల్డ్‌ బ్లడెడ్‌ యాక్షన్‌ ప్లాన్‌
వంద అడుగుల రోడ్డును ఇరుకుగా మార్చి.. తన బహిరంగ సభల్లో జనం విపరీతంగా కనిపించాలని.. డ్రోన్‌షాట్‌ కెమెరాలతో టైట్‌ షాట్స్‌ పెట్టుకుని మీడియాలో కనిపించాలనే కక్కుర్తితో జరిగిన కోల్డ్‌ బ్లడెడ్‌ యాక్షన్‌ ప్లాన్‌గా కందుకూరు ఘోర ఘటనను చూడాలి. అక్కడ 100 అడుగుల విశాలమైన రోడ్డును ఫ్లెక్సీలు పెట్టి ఇరుకైన సందుగా మార్చారు. రెండు వైపులా భారీ ఫ్లెక్సీలు పెట్టి, రోడ్డును 30 అడుగులు చేశారు. ఒక టన్నెల్‌లాగా కెమెరాల్లో జనాలను సంద్రంగా చూపెట్టాలనుకున్నాడు.

అందు కోసం పోలీసుల సూచనల్ని సైతం లెక్క చేయకుండా కాన్వాయ్‌ను ముందుకు తీసుకొచ్చి, ఇరుకైన రోడ్‌లో ఆపి జనాన్ని ఒక చోటికి చేర్చాలని తాపత్రయ పడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. నిజానికి కాలువలో పడిన వాళ్లు భద్రంగా బయటకొచ్చారు. కేవలం తొక్కిసలాట వల్లనే అంత మంది చనిపోయారు. 

నేరంగా పరిగణించాలి
నైతికంగా చూస్తే లెక్కలేనితనంతో చేసే ఇలాంటి కార్యక్రమాలను కూడా నేరాలుగానే పరిగణించాలి. ఉన్నదాన్ని సౌకర్యవంతంగా చూసుకుని జనాలకు ఇబ్బందులు లేకుండా సభలు జరుపుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నిన్న జరిగిన సంఘటనను బట్టి భవిష్యత్తు కార్యక్రమాల పట్ల అధికార యంత్రాంగం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. 

టైమ్, లొకేషన్, సభ జరిపిన పద్ధతి, బారికేడ్లు.. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయి. కాబట్టి దీనిపై పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలు రూల్స్‌ ప్రకారం వ్యవహరిస్తాయి. అందుకే వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. అలాగే ఇక నుంచి విశాలమైన స్థలాల్లోనే సభలకు అనుమతి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 

అయినా పశ్చాత్తాపం లేదు
అయితే ఇంత జరిగినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. ఆయన ముఖంలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. పైగా దుర్ఘటన నుంచి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం, శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి విమర్శలు చేస్తున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల అంత మంది ఆవేశంతో వచ్చారని, మరణించిన వారంతా త్యాగం చేశారని, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో వారంతా సమిథలయ్యారని ఏదేదో మాట్లాడుతున్నాడు. 

ఇంతకన్నా నీచత్వం ఉంటుందా?:
సభకు, సమావేశానికి వచ్చే వారెవరైనా ప్రాణత్యాగం చేయాలని వస్తారా? ఎవరు, ఏ కారణంతో వచ్చినా, ఇంటికి తిరిగి జాగ్రత్తగా వెళ్లాలనే అనుకుంటారు తప్ప, చనిపోవడం కోసం రారు కదా? కానీ చంద్రబాబు మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన కోసం తొక్కిసలాటలో చనిపోయి, ఆయన పొగడ్తలకు ప్రాప్తులు కావడం వల్ల వారి జన్మలు ధన్యమవుతాయన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా నీచత్వం, దివాలాకోరుతనం ఏమైనా ఉంటుందా?.

ఘోరం నుంచి లాభం–బాబు నైజం
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయకులు బలయ్యారు. అయినా దాన్ని సమర్థించుకుంటూ, జనం విపరీతంగా రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, గతంలో కుంభమేళాల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారు. 
ఎక్కడైనా ఘోరం జరిగితే, చివరకు దాన్నించి కూడా లాభం పొందాలని చూడడం చంద్రబాబు నైజం. ఈ మాటలు స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఏదైనా ఉద్యమం అంటే కనీసం ఒక బస్సు అయినా పగలాలి. ఎక్కడైనా విధ్వసం జరగాలి. ఏదైనా తగులబడాలి. చావైనా జరగాలి. ఈ ఘటనపై సమీక్ష కూడా జరగాలి. తాను ఏదనుకుంటే అది జరగాలి. అదే చంద్రబాబు నైజం అని దగ్గుపాటి చెప్పారు.

జనం ఛీ కొడుతున్నారు
ఏదో రకంగా నాటకాలతో పబ్బం గడుపుకుని ప్రజలు తనను నెత్తిన పెట్టుకోవాలని చేసిన ప్రయత్నానికి పరాకాష్ట నిన్నటి ఘటన. దీన్ని చూసిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఛీ కొడుతున్నారు. దీంతో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడనేది పక్కన బెట్టి.. సభ్యసమాజంలో అందరితో కలిసిపోయే ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా కూడా చంద్రబాబు లేడనేది తేటతెల్లమైంది. 

కచ్చితంగా చంద్రబాబు బాధ్యుడు
100 అడుగుల రోడ్డును 30 అడుగులుగా చేసినందుకు వాళ్లను ఏం చేయాలి?. అది క్రిమినల్‌ ఆలోచన కాదా?. తొక్కిసలాటకు అవకాశం ఉండే విధంగా ఫ్లైక్సీలతో రోడ్డును ఇరుకుగా చేశారు. వెనుకనున్న జనాన్ని ముందుకు తోసుకునేలా కుట్రపూరిత ఆలోచన చేశారు. అంత మంది అమాయకుల మరణానికి కారణమయ్యారు. అందుకే చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి నిన్నటి ఘటనపై మాట్లాడే నైతిక హక్కు లేదు. అంతే కాదు నిన్నటి ఘటనకు చంద్రబాబే పూర్తిగా బాధ్యుడు. ఆయన కుట్రపూరిత నేరానికి వ్యక్తిగతంగా కచ్చితంగా బాధ్యుడు.

మరిన్ని వార్తలు