కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా ఆ ప్రాంత అభివృద్ధి

2 Jun, 2022 19:46 IST|Sakshi

ఈ ఫొటో చూడండి. మెళియాపుట్టి కొండకు ఆనుకుని ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రదేశమిది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాంతానికి నీరు వెళ్లనుంది. నీటి పిల్లర్, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం.   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా సిక్కోలు అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ప్రతిపక్షం చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా నిజం లేదని రుజువు చేస్తున్నాయి. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయని పనిని అధికారంలోకి రాగానే చేసి చూపించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు అక్కడి తాగునీరే కారణమై ఉండొచ్చని పలు అధ్యయనాలు చెబుతుండటంతో ఆ సమస్యను మొదటిగా పరిష్కరించేందుకు వైఎస్‌ జగన్‌ ఉపక్రమించారు. రూ.700కోట్లతో ఉద్దానం మెగా మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు 80శాతం మేర పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా ఉద్దానంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు.   

►జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 187 గ్రామాల్లో మూత్రపిండాల జబ్బులు ఎక్కువగా ఉన్నాయి.  
►సుమారు 20వేల మంది మూత్రపిండాల వ్యాధితో వివిధ దశల్లో ఉన్నట్లు అంచనా.  
►ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే పనిలో ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోంది. వంశధార రిజర్వాయర్‌ నుంచి 807 గ్రామాలకు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తోంది.  
►దాదాపు 5,57,633 మందికి తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశ్యం.    

చేపడుతున్న పనులివి.. 
►హిరమండలం రిజర్వాయర్‌ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా 1.12 టీఎంసీల వంశధార నీటిని అందించేందుకు 1067.253 కిలోమీటర్ల పైపులైను ఏర్పాటు చేస్తున్నారు.   
►మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద 84 మిలియన్‌ లీటర్ల తాగు నీటి పిల్లర్‌ బెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.  
►264ఓవర్‌ హెడ్‌ సర్వీసింగ్‌ రిజర్వాయర్లు నిర్మించారు. మరో 500 ఓవర్‌ హెడ్‌ సర్వీసింగ్, బ్యాలెన్సింగ్‌ ఇతరత్రా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. 
►హెడ్‌ ట్యాంకుల నుంచి గ్రామాల్లోని స్థానిక ట్యాంకులకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తారు.  

చదవండి: అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్‌ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ 

మరిన్ని వార్తలు