AP: ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించలేదు

27 Jul, 2021 10:55 IST|Sakshi

సీమ ఎత్తిపోతలపై పిటిషన్‌ను కొట్టివేయండి

పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవాలు లేవు

రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు 

సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించలేదని, తమకు అలాంటి ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, అందులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్జీటీలో ఇటీవల కౌంటర్‌  దాఖలు చేసింది. 

కౌంటర్‌లో ప్రధానాంశాలు ఇవీ..
కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయింపుల మేరకే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు  రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు కన్నా దిగువన ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు వాటా నీటిని తీసుకునే అవకాశం లేదు.
 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేందుకు ప్రతిపాదిత పథకాన్ని చేపట్టాం. ఈ నీటిని శ్రీశైలం కుడికాలువ, తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి తాగునీరు, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి సుజల స్రవంతి, ఎస్‌ఆర్‌బీసీకి తరలించాలి. రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన 101 టీఎంసీల మేరకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపడుతున్నాం. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు కేటాయింపులున్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. అందువల్లే కేటాయించిన వాటా నీటిని వినియోగించుకునేందుకే 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా సీమ ఎత్తిపోతలకు ప్రణాళిక రూపొందించాం. అది కూడా పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకే.
 2020 జూలై 13న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ అవసరమైన అధ్యయనం చేయాలని ఎన్జీటీ పేర్కొంది. తదనుగుణంగా తక్కువ ధరకు బిడ్‌ చేసిన బిడ్డర్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చారు.
  2020 అక్టోబర్‌ 29న ఇచ్చిన ఆదేశాల్లో ట్రిబ్యునల్‌ పలు సూచనలు చేసింది. బిడ్డర్‌  సమగ్ర సర్వే చేయాలని, ముచ్చుమర్రి వద్ద భూసేకరణను నివారించడంలో భాగంగా మరే ఇతర ప్రాంతంలోనైనా పథకం నిర్మాణం చేపట్టవచ్చా? అనే అంశంపై సర్వే చేయాలని సూచించింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఎడమ వైపున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని బిడ్డర్‌ తెలిపారు.
 బిడ్డర్‌ నివేదికను సాంకేతిక కమిటీ పరిశీలించి అనుమతించింది. అనంతరం పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద పథకం నిర్మాణం నిమిత్తం తనిఖీ చేయాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2020 డిసెంబర్‌ 4న జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చింది. నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంత కన్జర్వేటర్‌ను అభిప్రాయాలు చెప్పాలని కోరగా బిడ్డర్‌ సూచించిన ప్రాంతం ఎకో సెన్సిటివ్‌ జోన్‌లోకి రాదని నివేదించారు. ఈ మేరకు మార్పులు చేసిన వివరాలను ఎన్జీటీ ముందు ఉంచుతున్నాం. మార్పుల ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే ప్రాంతం ఏమీ లేదు. ప్రస్తుత కాలువ సామర్థ్యం కూడా పెరగదు.

 పథకంలో మార్పులు చేసిన అనంతరం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఈ ఏడాది జూన్‌ 30న కేంద్ర జల సంఘానికి, జూలై 1న కృష్ణా బోర్డుకు అందచేశాం. మార్పులు చేసిన ప్రతిపాదిత పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూన్‌ 9న కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. జూన్‌ 17, జూలై 7న నిర్వహించిన సమావేశాల్లో జలశక్తి నిపుణుల కమిటీ మార్పుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని వివరణలు కోరింది. అది పెండింగ్‌లో ఉంది. 

 సాగు, తాగు నీరు నిమిత్తం కేటాయించిన జలాలను తీసుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఎత్తిపోతల ద్వారా తీసుకునే జలాలు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు నగరి సుజల స్రవంతి కోసమేనని, కొత్తగా సాగు ప్రాంతం ఏమీ లేదని, పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మార్పులు చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది.

 ఎన్జీటీ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఉత్తరం వైపు ఎలాంటి కాంక్రీట్‌ పనులు జరగడం లేదు. ప్రతిపాదిత కొత్త స్థలంలో ఫౌండేషన్‌ నిమిత్తం తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 అక్టోబర్‌ 29 నాటి ఆదేశాలను ఉల్లంఘించలేదు. పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆ పిటిషన్‌ను కొట్టివేసి భారీ జరిమానా విధించాలని కోరుతున్నాం.

మరిన్ని వార్తలు