‘ఇసుక’ బాధ్యత ఎంఎస్‌టీసీకి..

5 Jan, 2021 04:26 IST|Sakshi

మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ

సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయమైన విధానంలో ఇసుక సరఫరా చేసేందుకు సంస్థల ఎంపిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ)కి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ, ఎంఎస్‌టీసీ సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఎంఎస్‌టీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గణేష్‌ ఎన్‌ జయకుమార్, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.హరినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మూడు ప్యాకేజీలుగా విభజన
ఇసుక సరఫరాకు సంస్థల ఎంపిక కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరుగా టెండర్లు నిర్వహిస్తారు. మొదటి ప్యాకేజీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలు ఉంటాయి. రెండో ప్యాకేజీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.. మూడో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలు ఉంటాయి. వాటి పరిధిలో ఇసుక తవ్వకం, రీచ్‌లు/స్టాక్‌ యార్డుల నిర్వహణ, సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ఎంఎస్‌టీసీ బిడ్లు ఆహ్వానిస్తుంది. సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్‌ బిడ్లు స్వీకరిస్తుంది. ఇలా 2 రకాల బిడ్ల ద్వారా 3 ప్రాంతాలకూ ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎంఎస్‌టీసీపై ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక సరఫరాకు ఈ ఒప్పందం దోహదపడుతుందని, దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీని వెనుక కచ్చితంగా టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. 

మెరుగైన విధానం తీసుకొచ్చేందుకే..
2019 ఇసుక పాలసీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సీఎం వైఎస్‌ జగన్‌Ð దీనిపై మంత్రుల కమిటీ నియమించారు. కమిటీ పలుమార్లు చర్చించి ఆన్‌లైన్‌ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి నిర్వహణ బాధ్యతను పెద్ద సంస్థలకు అప్పగించాలంటూ పలు సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత రూపొందించిన ఇసుక పాలసీకి సవరణలను మంత్రివర్గం ఆమోదించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే శాస్త్రీయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంఎస్‌టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 

టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు
ఆసక్తి ఉన్న ఏ సంస్థ అయినా తమ సంస్థను సంప్రదించి టెండర్లలో పాల్గొనవచ్చని ఎంఎస్‌టీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజరు గణేష్‌ ఎన్‌ జయకుమార్‌ సూచించారు. తమ సంస్థ రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక నిర్వహణకు సంస్థలను ఎంపిక చేసిందని ఆయన వివరించారు.
– గణేష్‌ ఎన్‌ జయకుమార్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎంఎస్‌టీసీ 

>
మరిన్ని వార్తలు