టాటా పవర్, ఐవోసీ జట్టు

12 Dec, 2023 05:12 IST|Sakshi

దేశవ్యాప్తంగా 500 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్‌ ఈవీ చార్జింగ్‌ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌లో టాటా పవర్‌ చార్జింగ్‌ పాయింట్లను ఇన్‌స్టాల్‌ చేస్తుంది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్‌ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్‌ హెడ్‌ (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ – ఈవీ చార్జింగ్‌) వీరేంద్ర గోయల్‌ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్‌ ఈజెడ్‌ చార్జ్, ఇండియన్‌ఆయిల్‌ ఈ–చార్జ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు