ఆట కాదు.. వేట

16 Nov, 2023 04:34 IST|Sakshi

జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన ఏపీ 

27 పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు 

గత ఏడాదితో పోలిస్తే 11 పతకాలు అధికం 

టార్గెట్‌ గోవా పేరుతో శాప్‌ ప్రత్యేక శిక్షణ శిబిరాలు 

రూ.80 లక్షలతో 17 క్రీడాంశాల్లో స్పెషల్‌ కోచింగ్‌ 

శిక్షణతో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులు 

సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పోటీల్లో ఏపీ క్రీడాకారుల బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే పతకాల వేటలో అద్భుతంగా రాణించింది. 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఆంధ్రప్రదేశ్‌ 37వ జాతీయ క్రీడల్లో సత్తా చాటింది.

మహిళా అథ్లెట్లు నాలుగు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో అదరగొట్టారు. గత ఏడాది అథ్లెటిక్స్‌లో ఆరు పతకాలు రాగా.. ఈ ఏడాది 8కి పెరిగాయి. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 3 నుంచి 5కు పెరిగాయి. వాటర్‌ స్పోర్ట్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి పోటీలోనే పతకం రావడం విశేషం. 20 క్రీడాంశాల్లో 183 క్రీడాకారులు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... ఇందులో 31 మంది పురుషులు,33 మంది మహిళా క్రీడాకారులు వ్యక్తిగత, బృంద విభాగాల్లో పతకాలు సాధించారు.  

శిక్షణ అదిరింది 
జాతీయ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ‘టార్గెట్‌ గోవా’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. క్రీడా సంఘాల సమన్వయంతో దాదాపు 17 క్రీడాంశాల్లో షెడ్యూల్‌ ప్రకారం శాప్‌ కోచ్‌లతో స్పెషల్‌ కోచింగ్‌ క్యాంపు నిర్వహించింది. ఫలితంగా క్రీడాకారుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పతకాల సంఖ్య కూడా పెరిగింది. 17 క్రీడాంశాల్లో శిక్షణ క ల్పిస్తే.. వీటిల్లో ఏకంగా 10 విభాగాల్లో పతకాలు రావడం విశేషం. ఈ స్పెషల్‌ క్యాంపు కోసం ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేయడంతో పాటు మరో రూ.14.16 లక్షల విలువైన క్రీడా పరికరాలు, దుస్తులను సమకూర్చింది. వీటితో పాటు పోటీలకు వెళ్లే ముందు టీఏ, డీఏల కింద మరో రూ.12 లక్షలు విడుదల చేసింది. గతేడాది 8 విభాగాల్లో 16 పతకాలు సాధిస్తే.. ఇప్పుడు 11 విభాగాల్లో ఏకంగా 27 పతకాలు గెలుపొందడం విశేషం.  

క్రీడాకారులకు రెట్టింపు ప్రోత్సాహం 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేసింది. గతంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను రెట్టింపు చేసింది. జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే రూ.5 లక్షలు, రజతానికి రూ.4 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా క్రీడాకారులు ఆరి్థక ఇబ్బందులను దాటి పతకాలను ఒడిసి పడుతున్నారు.  

పతకాల ఒరవడిని కొనసాగిస్తాం 
ఏపీలోని యువతను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాప్‌ ప్రత్యేక కోచింగ్‌ క్యాంపుల ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తోంది. వచ్చే జాతీయ పోటీల్లోనూ ఇప్పటి కంటే మెరుగైన ప్రదర్శన, ఎక్కువ పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. ఈ పతకాల ఒరవడి ఇలానే కొనసాగేలా చూస్తాం. – ధ్యాన్‌ చంద్ర, ఎండీ,  ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ  

సాధించిన పతకాలు ఇలా.. 
♦ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం (డి.పూజా, ఎస్‌కే గౌస్‌), మహిళా బ్యాడ్మింటన్‌ జట్టుకు కాంస్యం (కె.నవ్య, టి.సూర్య చరిష్మా, ఎల్‌.మమైఖ్య, 
డి.రష్మీత, ఎం.ఆకాంక్ష, సీహెచ్‌.సాయి ఉత్తేజ్‌రావు, డి.పూజ, పి.సోనికసాయి, డి.దీపిక, డి.స్రవంతి) లభించాయి. 
♦ మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 85 కేజీల విభాగంలో ఎన్‌.లలిత (స్వర్ణం), 59 కేజీల విభాగంలో ఎం.దీపనయోమి (కాంస్యం), పురుషుల్లో 109 కేజీల విభాగంలో బీఎస్‌ విష్ణువర్ధన్‌ (రజతం), 55 కేజీల విభాగంలో ఎస్‌.గురునాయుడు (కాంస్యం), 73 కేజీల విభాగంలో జె.కోటేశ్వరరావు (కాంస్యం) పతకాలు సాధించారు. 
♦ పెన్కాక్‌ సిలాట్‌ 80–85 కేజీల విభాగంలో డీఎన్‌వీ రత్నబాబు (కాంస్యం), మోడ్రన్‌ పెంటా­థ్లాన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ 
డి.వెంకటేశ్, ఎన్‌.సనుతి యశోహర (కాంస్యం) పొందారు. 
♦ అథ్లెటిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌ల్లో జ్యోతి యర్రాజీ  (స్వర్ణం), 200 మీటర్ల పరుగులో (కాంస్యం) సాధించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ప్రత్యూష, మధు కావ్యారెడ్డి, భవానీ యాదవ్, జ్యోతి యార్రాజీ బృందం 
(స్వర్ణం), 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రత్యూష, జ్యోతికశ్రీ, ఎం.శిరీష, కె.రజిత బృందం (స్వర్ణం) కైవసం చేసుకుంది. 
♦ 400 మీటర్ల పరుగులో జ్యోతికశ్రీ (రజతం), జావెలిన్‌ త్రోలో రేష్మి శెట్టి (కాంస్యం), త్రిపుల్‌ జంప్‌లో ఎం.అనూష (కాంస్యం), 200 మీటర్ల పరుగులో జ్యోతి యర్రాజీ కాంస్యం సాధించారు. మహిళల హెప్టాథ్లాన్‌లో సౌమ్య మురుగన్‌ స్వర్ణంతో అదరగొట్టింది.  
♦ తైక్వాండోలో మహిళల 67 కేజీల విభాగంలో కనక మహాలక్ష్మి, పురుషుల 68 కేజీల విభాగంలో టి.వరుణ్‌ కాంస్య పతకాలు గెలుపొందారు.  
♦ సెపక్‌ తక్రాలో మహిళల డబుల్‌ ఈవెంట్‌లో ఎం.మధులత, టి.నాగహారిక, 
జి.రోషిత బృందం (రజతం), పురుషుల రెగు విభాగంలో ఎం.అర్జున్, సి.అశోక్‌కుమార్, జి,శివ కుమార్, ఎస్‌.మాలిక్‌ బాషా, టి,షణ్ముక్‌ శ్రీవంశీ బృందం 
(కాంస్యం) సాధించాయి. 
♦ ఆర్చరీలో జి.బైరాగినాయుడు స్వర్ణం, మహిళల కయాకింగ్‌లో నాగిడి గాయత్రి రజతం సాధించింది. ఖోఖోలో ఏపీ పురుషుల జట్టు కాంస్యం గెలుపొందింది. 
♦ స్కే మార్షల్‌ ఆర్ట్స్‌లో పురుషుల 50 
కేజీల విభాగంలో పి.ప్రవీణ్‌ (రజతం), 58 కేజీల విభాగంలో ఎం.నీలాంజలి ప్రసాద్‌ (కాంస్యం), 75 కేజీల విభాగంలో బి.శ్రీనివాసులు (కాంస్యం) సాధించారు. 

మరిన్ని వార్తలు