ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు వారాల గడువు

24 Jul, 2021 08:32 IST|Sakshi

ఆలోపు ప్రత్యామ్నాయం చూసుకోండి

అమరారెడ్డి కాలనీ కాలువ కట్ట వాసులకు హైకోర్టు ఆదేశం

విచారణ ఆగస్టు 6కి వాయిదా

సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, అమరారెడ్డి నగర్‌ కాలనీ ఆంధ్రరత్న కాలువ కట్టపై ఉన్న నివాసితులు ఇళ్లను ఖాళీ చేసేందుకు హైకోర్టు రెండు వారాల గడువునిచ్చింది. ఆలోపు ప్రత్యామ్నాయం చూసుకోవాలంది. తదుపరి విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. అప్పటి వరకు కాలువ కట్టపై మిగిలి ఉన్న నివాసితుల విషయంలో ఎలాంటి బలవంత పు చర్యలు చేపట్టవద్దని అధికారులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ ఉత్తర్వులిచ్చారు. తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ అమరారెడ్డి కాలనీకి చెందిన కొత్తూరు నరేశ్, వి.రాజ్యలక్ష్మి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రమేశ్‌ శుక్రవారం  విచారణ జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ, కాలువ కట్టపై నివాసం ఏర్పరచుకున్న వారికి పరిహారం చెల్లించామని, ప్రభుత్వ భూమి ఇచ్చామని తెలిపారు. టిడ్కో ఇళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. 246 మంది స్వచ్ఛందంగా అక్కడి నుంచి వెళ్లిపోయి ప్ర త్యామ్నాయ నివాసాలు చూసుకున్నారన్నారు.

మిగతా 22 ఇళ్లు ఖాళీ చేసేందుకు వారం సమయం ఇస్తామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వెలివెల శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.  ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు నెలల గడువునివ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు వారాల గడువునిచ్చారు. ఆలోపు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని పిటిషనర్లను ఆదేశించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు