కౌలు చెల్లించాల్సింది సీఆర్‌డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు

17 Oct, 2023 06:02 IST|Sakshi

రాజధాని రైతుల కౌలు వ్యవహారంలో హైకోర్టులో కీలక పరిణామం

కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదని న్యాయవాది ఇంప్లీడ్‌ పిటిషన్‌

రాజధాని కోసం రూ.1000 కోట్లతో ఫండ్‌ ఏర్పాటు చేశారు

ఆ ఫండ్‌ నుంచే సీఆర్‌డీఏ కౌలు చెల్లించాలి

ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు

తీవ్ర అభ్యంతరం తెలిపిన రాజధాని పిటిషనర్లు

విచారణ ఈ నెల 30కి వాయిదా

సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్‌డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్‌ నుంచి సీఆర్‌డీఏనే కౌలు చెల్లించాలన్నారు.

ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు.

సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్‌ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్‌డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్‌డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్‌ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.

రైతులను ఇబ్బంది పెట్టేందుకే...
ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండా ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలైందని తెలిపారు.

మీరు (జస్టిస్‌ కృష్ణమోహన్‌) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్‌) కలిగి ఉన్నారని ఆరోపించారు.  రాజకీయ కారణాలతో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, పిటిషనర్‌ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు